Salman Khan gets death threat again: సల్మాన్ ఖాన్‌ని చంపేస్తామని మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి గుర్తుతెలియని దుండగులు ఈ వాట్సాప్ మెసేజ్ పంపించారు. సల్మాన్ ఖాన్ రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేదంటే ఆయన్ని చంపేస్తామని దుండగులు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎక్స్‌టార్షన్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్స్ కింద వొర్లి పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది.
సల్మాన్ ఖాన్ సన్నిహితమిత్రుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖిని అక్టోబర్ 12న హత్య చేశారు. ఈ హత్యకు తామే బాధ్యులం అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అప్పటి నుండి సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్, మెసేజులు రావడం ఇది మూడోసారి. మొదటిసారి ఇలానే ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించిన యువకుడు హుస్సేన్ షేక్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
జంషెడ్‌పూర్‌కి చెందిన హుస్సేన్ షేక్ కూరగాయల వ్యాపారి. కాల్ డేటా ఆధారంగా హూస్సేన్ ఆచూకీ గుర్తించిన ముంబై పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ ఆర్డర్‌పై ముంబైకి తీసుకొచ్చారు. రెండోసారి సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు మరో వ్యక్తిని నొయిడాలో అరెస్ట్ చేశారు. నొయిడా కోర్టులో ట్రాన్సిల్ ఆర్డర్ తీసుకుని ముంబై తరలించారు. ఈ రెండు బెదిరింపు కేసులకు సంబంధించిన దర్యాప్తు ఇలా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది.