Droupadi Murmu Salary: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?
Droupadi Murmu Salary: ఒక్క భారతదేశంలోనే కాదు.. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Draupadi Murmu Salary: ఒక్క భారతదేశంలోనే కాదు.. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యంత దిగువ స్థాయి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తొలి గిరిజన మహిళగా.. ఆమె దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించారు రు. అంతేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ పౌరురాలిగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ముకు లభించబోయే అధికారాలేంటి? ప్రభుత్వం నుంచి అందుకునే జీతభత్యాల వివరాలేంటి? ఇతర ప్రత్యేకమైన సదుపాయాలేంటో ఓసారి చూద్దాం.
దేశంలో అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశం అనుసరిస్తున్న అత్యున్నతమైన ప్రజాస్వామ్య విధానానికి ఆమె ఎన్నికే ఓ గీటురాయిగా నిలుస్తోందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థాయికి ఎన్నికవడంతో యావత్ గిరిజన జాతి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమె రాష్ట్రపతిగా వేతనం ఎంత అందుకుంటారనేది ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది.
భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెల వేతనమే కాకుండా అదనంగా అనేక సదుపాయాలు భారత ప్రభుత్వం కల్పిస్తోంది. ఉచిత నివాసం, ఉచిత వైద్యం, ఏటా ఆఫీసు ఖర్చుల కోసం లక్ష రూపాయలు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రపతి హోదాలో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అత్యంత విలాసవంతమైన మెర్సిడెజ్ బెంజ్ కారు, పటిష్టమైన భద్రత ఎల్లప్పుడూ కొనసాగుతుంది. కారుకు నెంబర్ ప్లేట్ ఉండదు. దానికి బదులుగా జాతీయ చిహ్నం మాత్రమే ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా కారుకు సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించరు. ఇక రాష్ట్రపతి జీవితభాగస్వాములకూ అదే తరహా గౌరవాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది.
రిటైర్మెంట్ తరువాత కూడా రాష్ట్రపతి హోదాకు తగ్గనిరీతిలో వారి అలవెన్సులను భారత ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రపతి రిటైర్మెంట్ తరువాత నెలకు లక్షన్నర పెన్షన్ వస్తుంది. జీవితభాగస్వామికి సైతం సెక్రటేరియల్ అసిస్టెన్స్ కింద నెలకు రూ. 30 వేలు వెళ్తాయి. అద్దె లేని అత్యంత విలాసవంతమైన బంగళాను కేటాయిస్తారు. రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఒక మొబైల్ కూడా ప్రభుత్వం వైపు నుంచి అందజేస్తారు. రిటైర్మెంట్ తరువాత కూడా పర్సనల్ స్టాఫ్ గా ఐదుగురిని నియమించుకునే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పర్యటించినా తనతో పాటు మరొకరికి హైక్లాస్ ట్రెయిన్ లో గానీ, ఎయిర్ బస్ లో గానీ ప్రయాణించే వీలుంది.
ఇక రాష్ట్రపతి భవన్ దేశంలోని అన్ని అధికార భవనాల కన్నా అత్యంత ఖరీదైంది మాత్రమే కాదు అత్యంత విలాసవంతమైంది కూడా. 330 ఎకరాల ఎస్టేట్లో రాష్ట్రపతి భవన్ ఐదు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా కొలువుదీరింది. ఇందులోని 4 అంతస్తుల్లో 340 విలాసవంతమైన గదులున్నాయి. రెండున్నర కిలోమీటర్ల కారిడార్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 190 ఎకరాల్లో ఎటుచూసినా పచ్చనైన గార్డెన్స్ పరవశింపజేస్తాయి. ఈ అందమైన భవనాన్ని 1929లో నిర్మించారు. వేలాది మంది శ్రామికులు, కళాకారులు, వాస్తునిపుణులు ఇందులో పాలు పంచుకున్నారు. అప్పట్లో భారత వైస్రాయి కోసం నిర్మించిన ఈ భవనమే తరువాతి కాలంలో రాష్ట్రపతిభవన్ గా మారింది.
ఇక రాష్ట్రపతికి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ మాత్రమే గాక దేశంలోని మరో రెండు ప్రదేశాల్లో విడిది చేయడానికి రెండు అధికారిక భవనాలున్నాయి. ఏటా రెండుసార్లు దాదాపు రెండు వారాలపాటు ఆయా విడుదుల్లో సేద దీరుతారు. షిమ్లాలో ఒక విడిది భవనం, హైదరాబాద్ లో మరో విడిది భవనం ఉన్నాయి. వేసవిలో షిమ్లాలో బస చేస్తే చలికాలంలో హైదరాబాద్ లో విడిది చేయడం ఆనవాయితీ.