RTC: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆర్టీసీ యూనియన్ల మండిపాటు
RTC: ప్రైవేటీకరణ కోసం మోటారు వాహన చట్టం తెచ్చారని విమర్శలు
RTC: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. విశాఖ ఉక్కుతోపాటు బ్యాంకులను కూడా ప్రైవేటీకరిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మరోవైపు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీంతో ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. రవాణా రంగంలో కూడ సంస్కరణలను వేగవంతం చేసింది. 2021-22 బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో 20వేల బస్సుల తయారీని నేరుగా ప్రైవేట్ సంస్థలకే అప్పగించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆటోమొబైల్స్ రంగానికి ఊతమివ్వడంతోపాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆర్టీసీ ఉద్యోగ యూనియన్ల నేతలు మండిపడుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా వంద శాతం ప్రభుత్వ సంస్థలను ప్రవేటీకరణ చేస్తామని మోడీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రవాణా రంగాన్ని ప్రైవేటీకరించడం కోసమే మోటారు వాహన చట్టం తెచ్చారని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీపై పెనుభారం మోపుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
ఇక 18వేల కోట్ల రూపాయల వ్యయంతో 20వేల బస్సులను పీపీపీ మోడల్‌లో ప్రజారవాణాలోకి తెస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. అయితే ఆ డబ్బును ఆర్టీసీకి ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆర్టీసీ యూనియన్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆర్థిక సంస్కరణలే అయినా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండడం వల్ల సగటు సామాన్యులపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది.