Husband And Wife: మీ ఆవిడ కూడా మీకు ఇలాగే ఇస్తారా?

Update: 2024-09-15 14:33 GMT

Husband And Wife Matters: ఇంట్లో భార్యభర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఇంట్లోకి అవసరమైన కూరగాయాలు తీసుకురాకుంటే ఒక సమస్య. ఒకవేళ భర్త కూరగాయలు తీసుకొస్తే అవి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయంలో భార్యాభర్తల మధ్య మరొక డిబేట్. సాధారణంగా గృహిణులకు కూరగాయల ఎంపికపై ఉన్నంత పట్టు మగవారికి ఉండదు అనేది సర్వసాధారణంగా వినిపించే ఒక ''పబ్లిక్ ఒపినియన్''. అందుకే పొరపాటున భర్త తీసుకొచ్చిన కూరగాయల్లో పుచ్చులున్నాయంటే, వాళ్లావిడ చేతిలో అతడి పరిస్థితి ఇక అంతే సంగతి అని అంటుంటారు. అందులో కొన్ని సరదాగా చేసుకునే జగడాలు ఉంటే.. ఇంకొన్ని సీరియస్‌గా వాదించుకునే వరకు వెళ్తాయి. అయితే, ఇది చాలా కుటుంబాల్లో కనిపించేదే కదాలే అని చెప్పుకుని సరిపెట్టుకుంటుంది పురుష ప్రపంచం.

అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అని అనుకుంటున్నారా? అయితే, రండి మీకు ఒక మహిళామణి తన భర్తకు కూరగాయల ఎంపిక కోసం రాసిచ్చిన గైడ్ చూపిస్తాం. అప్పుడు అసలు సీన్ ఏంటో మీకే అర్థమైపోతుంది.

చూశారు కదా!! యస్ మీరు చూసింది నిజమే. ఔను, అది కూరగాయలు ఎలా తీసుకురావాలి అనే విషయమై ఆమె తన భర్తకు రాసిచ్చిన చీటి. ఆవిడ ఎవరో కాదు.. ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భార్య. మోహన్ పర్గైన్ అనే రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ భార్య రాసిన ఈ చీటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలుగడ్డ (బంగాళాదుంపలు) ఎలా సెలెక్ట్ చేయాలి, పాలకూర కట్టలు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి ఉల్లిగడ్డ తీసుకోవాలి, ఎలాంటి టమాటాలు తీసుకోవాలి అని రాసిచ్చారామె. అంతేకాదు.. తన వర్ణనకు పక్కనే బొమ్మలు కూడా గీసిచ్చారు. అది కూడా తాను చెప్పిన చోటే తీసుకురావాలి అన్నట్లుగా ఆ డీటేయిల్స్ కూడా ఇచ్చారు.

ఆ చీటిని అతనే స్వయంగా ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా నెటిజెన్స్‌తో పంచుకున్నారు. తాను కూరగాయల కోసమని మార్కెట్‌కి వెళ్తుండగా.. తనకు ఒక సెలక్షన్ గైడ్ తరహాలో పనికొస్తుందని చెబుతూ తన భార్య ఈ చీటి రాసిచ్చారని మోహన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ హోదాలో ప్రపంచదేశాలు చుట్టొచ్చిన వ్యక్తికి, ఇంట్లో కూరగాయలు తీసుకురావడం ఒక సవాలుగా మారిందంటే పరిస్థితేంటో అర్థం చేసుకోండి. ఇదే విషయమై నెటిజెన్స్ రకరకాల జోకులేసుకుంటున్నారు. మీ ఆవిడ కూడా ఇలాగే ఇస్తారా అని నెటిజెన్స్ పరస్పరం కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ పెద్ద మనిషి పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. ఈ చీటిలో రాసినవాటిలో అన్నింటికంటే కొసమెరుపు ఏంటంటే.. పచ్చిమిర్చిని ఉచితంగా అడిగి తీసుకురమ్మని చెప్పారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భార్య అయిన ఆ ఇల్లాలు. 

Tags:    

Similar News