Haryana Results 2024 Review: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఇవేనా?

Update: 2024-10-08 16:08 GMT

Reasons Behind Congress Defeat in Haryana: హర్యానా ఎన్నికల ఫలితాలపై ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ పార్టీలో విజయంపై భారీ ఆశనురేపాయి. అందుకు తగినట్లుగానే ఓట్ల లెక్కింపు ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపించింది. కానీ ఆ తరువాత తరువాత చేపట్టిన రౌండ్లలో సీన్ రివర్స్ అయింది. అప్పటివరకు ఆధిక్యత కనబర్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత వెనుకబడిపోయింది. అప్పటివరకు వెనుకంజలో ఉన్న బీజేపి ముందంజలోకి దూసుకుపోయింది. మొత్తానికి హర్యానాలో బీజేపి ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోగా.. కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా ఆశలు అడియాశలే అయ్యాయి.

ఇంతకీ కాంగ్రెస్ పార్టీని ఊహించని దెబ్బ కొట్టిన అంశాలేంటి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకబడిపోయింది? ఏయే అంశాలు ఆ పార్టీకి ఓటమికి కారణమయ్యాయి అని విశ్లేషించే పనిలో రాజకీయ విశ్లేషకులు బిజీ అయ్యారు.

కీలకంగా మారిన అర్బన్ ఓటర్లు

రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం గురుగావ్, ఫరీదాబాద్, బల్లబ్‌ఘడ్ వంటి నగర, పట్టణ ప్రాంతాల్లో ఓట్లను పోగేసుకోవడంలో బీజేపి సక్సెస్ అయింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల ఓట్లు తమకే వస్తాయని బలంగా నమ్మిన కాంగ్రెస్ పార్టీ, అక్కడి ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో విఫలమైంది. ఒకరి విజయం మరొకరికి ఓటమే.. అలాగే ఒకరి ఓటమి మరొకరికి గెలుపే అవుతుందన్న చందంగా ఇలా బీజేపి రెండు ప్రాంతాల్లో లాభపడితే.. కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో నష్టపోయిందంటున్నారు.

రెండు పర్యాయాల తరువాత సైతం ప్రభావం చూపించలేకపోయిన కాంగ్రెస్

హర్యానాలో గత రెండు పర్యాయాలు బీజేపినే అధికారంలో ఉంది. ఈసారి తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పుకుంది. చివరకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులం మేమంటే మేమంటూ మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాకు, సీనియర్ లీడర్ కుమాకి సెల్జాకు మధ్య విపరీతమైన పోటీ వాతావరణం కూడా ఏర్పడింది. కానీ వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా ఓటర్లలో ప్రభావం చూపించలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే హర్యానా ఓటర్లు మరోసారి కూడా బీజేపికే పట్టం కట్టారు అనేది వారి మాట.

కాంగ్రెస్ కొంపముంచిన యాంటీ-జాట్ ఓట్స్

కాంగ్రెస్ పార్టీ జాట్ కమ్యునిటీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకుంది. ఆ భావనతోనే భూపిందర్ సింగ్ హుడా సైతం ఆ తెగకి చెందిన నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. కానీ కాంగ్రెస్ పార్టీని అదే భావన దెబ్బకొట్టిందంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్ రాజ్యం, జాట్ పెత్తనం ఎక్కువవుతుందనే అభద్రతా భావం అక్కడి ఓటర్లలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే జాట్ ఆధిపత్యం పెరగడం ఇష్టం లేని ఇతర కులాల వారు బీజేపికి ఓటు వేశారు అనేది అక్కడి విశ్లేషకులు చెబుతున్న మాట.

ప్రభావం చూపించిన బీజేపి గ్రౌండ్ వర్క్

ఈసారి హర్యానాలో బీజేపి పని అయిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాటలను ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. అందుకే తమ ప్రత్యర్థులకు తమని విమర్శించే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా హర్యానాలో మూలమూలనా బీజేపి అగ్రనేతలు వెళ్లి ప్రచారం చేశారు. బీజేపికి ప్రతికూలంగా కనిపించిన పరిస్థితులు కూడా ఆ పార్టీకి అనుకూలంగా మారిపోయాయంటే అందుకు ఎన్నికల ప్రచారంలో వారు శ్రమించిన తీరే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే.. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. దానికి కారణం ఆయా స్థానాల్లో పోటీ చేసిన ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే తమకు రావాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి ఆ ఓట్లు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రుల ఖాతాలో పడ్డాయనేది వారి వెర్షన్.

Similar News