Ratna Bhandar secret chamber: నేడు తెరచుకోనున్న రత్న భండార్‌ గది..46ఏళ్ల తర్వాత సంపద మదింపు

Ratna Bhandar secret chamber:పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నాల గది మరోసారి తెరుచుకోనుంది. ఈ రోజు ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య గదిని తెరవనున్నారు. ఈ గదిని 11 మంది సభ్యుల కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ బృందానికి హైకోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ రథ్ నేతృత్వం వహిస్తున్నారు.

Update: 2024-07-18 03:54 GMT

Ratna Bhandar secret chamber: నేడు తెరచుకోనున్న రత్న భండార్‌ గది..46ఏళ్ల తర్వాత సంపద మదింపు

Ratna Bhandar secret chamber:పూరీ శ్రీక్షేత్రంలోని రత్న భాండాగారం సుమారు 46ఏండ్ల తర్వాత తెరవడంతో అందులోని జగన్నాథుడి సంపదపై యావత్తు దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. పురుషోత్తముడి భక్తులైన రాజులు సమర్పించిన విలువైన కానుకలు, వజ్రవైఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, బంగారం కిరీటాలు ఏ మేరకు భద్రంగా ఉన్నాయనేది నేడు తేలనుంది. గురువారం రహస్యగదిని తెరవనున్నారు. అందులోని పెట్టెలు, అల్మరాలను ఒడిశా సర్కార్ నియమించిన కమిటీ సభ్యులు తెరిచి సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. జులై 14న ఆ గదిని కమిటీ ప్రతినిధులు కేవలం పెట్టెలు, అల్మరాలు చూసి వెనక్కు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ రోజు సమయం మించిపోవడంతో సీల్ వేశారు. గురువారం మళ్లీ తెరచి భారీ భద్రత నడుమ రహస్య గదిలోని సంపదను స్ట్రాంగ్ రూముకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి మీడియాతో మాట్లాడారు. తామంతా జగన్నాథుని సేవకు అంకితమయ్యామని..స్వామి కార్యం నెరవేర్చేందుకు రహస్యగదిలో సంపద తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన వెల్లడించారు. సంపద తరలింపు నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలను నిలిపిస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు. ఉదయం 8 గంటల తర్వాత అధీకృత వ్యక్తులు,సేవకులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని, గురువారం ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచి ఉంటుందని ఆయన చెప్పారు.

1978లో తెరచిన రత్నాభాండగారం గది

11 మంది సభ్యుల కమిటీకి హైకోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ రథ్ నేతృత్వం వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ ముహూర్తాలు నిర్ణయించారు. ఈ సమయంలో కమిటీ సభ్యులు స్టోర్‌హౌస్‌లోకి ప్రవేశిస్తారు. జగన్నాథుని స్టోర్‌హౌస్ 1978 నుండి మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గదిని తెరవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రత్నాల గది మాత్రం ఓపెన్ కాలేదు. స్వామివారి రత్నాల గది తెరవాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. ఈసారి రత్న భండార్ తో పాటు పూరీ ఆలయం  నాలుగు గదులను తెరవాలనే డిమాండ్ ఎన్నికల సమస్యగా మారింది. బీజేపీ తన మేనిఫెస్టోలో రత్న భండార్‌ను ఒపెన్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 46 ఏళ్ల తర్వాత జగన్నాథుని రత్నాల గది నేడు ఓపెన్ చేయనున్నారు. 1978లో రత్న భండారం తలుపులు తెరిచినప్పుడు దాదాపు 140 కిలోల బంగారు ఆభరణాలు, 256 కిలోల వెండి పాత్రలు లభించాయి. కాగా ఈ రత్నభాండాగారం రహస్యగదిలోని సంపద లెక్కింపునకు 30నుంచి 40 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్లు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ తెలిపారు. 

Tags:    

Similar News