Rajasthan Congress Crisis: అశోక్ గెహ్లాట్ వ్యూహం అట్టర్ ఫ్లాపైందా?

Rajasthan Congress Crisis: రాజకీయాల్లో హత్యలుండవ్ ఉంటేగింటే ఆత్మహత్యలే ఉంటాయి.

Update: 2022-09-27 06:26 GMT

Rajasthan Congress Crisis: అశోక్ గెహ్లాట్ వ్యూహం అట్టర్ ఫ్లాపైందా?

Rajasthan Congress Crisis: రాజకీయాల్లో హత్యలుండవ్ ఉంటేగింటే ఆత్మహత్యలే ఉంటాయి. నయా పాలిటిక్స్‌లో మోస్ట్ పాపులర్ డైలాగ్ ఇదే. ఇప్పుడు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విషయంలోనూ నూటికి నూరుశాతం ఇదే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్‌కు సీఎం సీటు దక్కనీయొద్దన్న మిషన్ కాస్తా ఘోరంగా విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకూ, ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది..? అశోక్ గెహ్లాట్ పొలిటికల్ గేమ్ ఎండ్ అయినట్టేనా..?

పొమ్మనలేక పొగబెట్టడం గురించి మీకు తెలిసే ఉంటుంది. రాజకీయాల్లో ఎవరినైనా పదవుల నుంచి తప్పించాల్సి వస్తే నేరుగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా యాక్షన్ షురూ చేస్తారు. చివరికి ఆ నేత సొంత పోరు పడలేక ఇంటికెళ్తిపోతారు. కానీ, రాజస్థాన్ సీఎం మాత్రం ఈ గేమ్ రూల్స్‌ మొత్తం మార్చేశారు. పూర్తిగా రివర్స్ ఆపరేషన్‌ షురూ చేశారు. కట్‌చేస్తే అశోక్ గెహ్లాట్ మార్చేసిన రూల్సే ఇప్పుడు కొంప ముంచే పరిస్థితి దాపురించింది. రాజస్థాన్ సీఎంగానా, లేక 137 ఏళ్ల హిస్టారికల్ పార్టీకి చీఫ్‌‌గానా అనే మాట పక్కనపెట్టేసి పార్టీ నుంచే తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిన సిట్యువేషన్ తలెత్తింది. అయితే, హస్తం పార్టీ అధిష్టానం ఆయనపై అంతగా ఉంచిన నమ్మకం వమ్మయ్యేలా అశోక్‌ గెహ్లాట్ ఏం చేశారు..?

ఓవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి మరోవైపు ఏఐసీసీ అధ్యక్ష రేసులో నిలవాలనే ఒత్తిడి ఇంకోవైపు తన ప్రత్యర్ధి సచిన్ పైలట్‌కు రాజస్థాన్ పగ్గాలు వెళ్లిపోతాయనే సంకేతాలు. ఎంత సీనియర్ నేత అయినా ఈ మూడు అంశాలు అశోక్ గెహ్లాట్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. కట్‌చేస్తే ఓ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఆ ప్లాన్ మరేంటో కాదు ఏఐసీసీ అధ్యక్ష బరిలో అధిష్టానానికి ఓకే చెప్తూనే తన వర్గం ఎమ్మెల్యేలను యాక్షన్‌లోకి దించడమే. సచిన్‌ పైలట్‌కు రాజస్థాన్ పగ్గాలు దగ్గకూడదని గట్టిగా డిసైడ్ అయిన గెహ్లాట్ తనకేం తెలీదంటూనే తనవర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. దేశం మొత్తం వీకెండ్‌ మూడ్‌లో ఉన్నవేళ హఠాత్తుగా గెహ్లాట్ సపోర్టర్స్‌ మూకుమ్మడిగా రాజీనామా అస్త్రం సంధించారు. వారందరి డిమాండ్ ఒక్కటే అశోక్ గెహ్లాట్‌ ఏఐసీసీ చీఫ్ రేసులో నిలిస్తే సచిన్ పైలట్‌కు కాకుండా గెహ్లాట్‌ వర్గానికి చెందిన స్పీకర్ సీపీ జోషికి సీఎం పదవి కట్టబెట్టాలన్నదే. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన మాత్రం వేరే ఉంది. అశోక్ గెహ్లాట్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఢిల్లీలో కూర్చోబెట్టి యంగ్ లీడర్‌ సచిన్‌ పైలట్‌కు రాజస్థాన్ పగ్గాలివ్వాలన్నది సోనియా అసలు ప్లాన్. కానీ, గెహ్లాట్ వర్గం రియాక్షన్‌తో ఏకంగా రాజస్థాన్‌లో పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి.

ఇలాంటి సమయంలోనే అధిష్టానం వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నకు అశోక్ హ్యాండ్స్‌ అప్ అనేశారు. తన వర్గం ఎమ్మెల్యేలు తన మాట కూడా వినట్లేదని, తన చేతుల్లో ఏం లేదన్నారు. అది ఎమ్మెల్యేల నిర్ణయమని, తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించారు. అయితే, ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ అయి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తానన్నారు. సరిగ్గా ఇక్కడే గాంధీల విధేయుడిపై అధిష్టానం నమ్మకం సడలిపోయింది. జీ23 రెబల్స్‌ గాంధీలపై ఎదురుదాడులకు దిగిన వేళ కొండంత అండగా నిలిచిన ఆ గెహ్లాటే ఈ గెహ్లాటా అనే స్థాయికి పరిస్థితులు వచ్చేశాయి. తర్వాత అజయ్‌ మాకెన్‌, కేసీ వేణు గోపాల్‌ను రంగంలోకి దించింది. తీరా ఈ ఇద్దరు ఢిల్లీ నుంచి రాజస్థాన్ అయితే వెళ్లారు కానీ, వీరిని కలిసేందుకు గెహ్లాట్ మద్దతు దారులు ముందుకు రాలేదు. దీంతో గెహ్లాట్ వర్గంతో ఎలాంటి చర్చలు జరపకుండానే ఢిల్లీకి తిరిగొచ్చేశారు.

నిజానికి అధ్యక్ష పీఠంపై గెహ్లాట్‌ను కూర్చోబెట్టాలనుకోవడానికి కారణమే ఆయన గాంధీల విధేయుడని. కానీ, అశోక్ గెహ్లాట్ మాత్రం తన వ్యూహంతో ఒక్కసారిగా అధిష్టానం నమ్మకాన్ని కోల్పోయినట్టు తెలుస్తోంది. హస్తం పార్టీ సీనియర్లు సైతం గెహ్లాట్‌ను అధ్యక్ష పోటీ నుంచి తప్పించాల్సిందే అంటున్నారు. దీంతో రాజస్థాన్ సీఎం పదవితో పాటు అధ్యక్ష రేసు నుంచి సైతం గెహ్లాట్‌ను తప్పించే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చివరికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ చేతుల్లోకి వెళ్లింది. గెహ్లాట్ తీరుపై సీరియస్‌గా ఉన్న సోనియా కమల్‌నాథ్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఫైనల్‌గా అశోక్ గెహ్లాట్‌ ఎపిసోడ్‌పై కమల్‌నాథ్ ఏం తేలుస్తారన్నదానిపైనే గెహ్లాట్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలియవచ్చు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్రాల సీఎంలను మార్చే అంశంలో కాంగ్రెస్ అధిష్టానానిదీ ఫెయిల్యూర్ హిస్టరీనే. అనేకసార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చబోయి హస్తం పార్టీ బొక్కబోర్లా పడింది. పుదుచ్చేరి, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో గతంలో సీఎంలను మార్చడంలో దెబ్బతిన్న కాంగ్రెస్ అధిష్టానం తాజాగా మరోసారి రాజస్థాన్‌లో ఫెయిలయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రాల సీఎంలను మార్చే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేతలను బుజ్జగించలేకపోతోంది. చివరకు వారంతా పార్టీ వదిలి వేరే పార్టీల్లో చేరుతున్నారు. సమర్థులైన నేతలంతా వేరే పార్టీలకు వెళ్తుండటంతో అధిష్టానం నిస్సహాయంగా చూడటం మినహా చేససేదేం లేకుండా పోతోంది. మధ్యప్రదేశ్‌లో 15 సంవత్సరాల విరామం తర్వాత 2017లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ విజయంలో జ్యోతిరాదిత్య సింధియా కీలకపాత్ర పోషించారు. అయితే సింధియాను పక్కనపెట్టి సీనియర్ నేత కమల్‌ నాథ్‌కు అధిష్టానం పట్టం కట్టింది. సరిగ్గా రెండేళ్లు గడిచాక సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయి పడిపోయింది. జ్యోతిరాదిత్య వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

మరోవైపు 2008లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని తప్పించి వి.వైతిలంగమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంను చేసింది. 2011లో కాంగ్రెస్ పార్టీ వీడిన రంగస్వామి తర్వాత ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి బీజేపీ పొత్తుతో పుదుచ్చేరి సీఎం అయ్యారు. పంజాబ్‌లో ఈ ఏడాది ఆరంభంలో అమరీందర్ సింగ్‌ను సీఎం పీఠం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం చన్నీని సీఎంగా చేసింది. ఆ తర్వాత అమరీందర్ పార్టీ బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారు. చివరకు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశంలో బీజేపీ మాత్రం సూపర్ సక్సెస్‌ అవుతూ వస్తోంది. ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటకల్లో విజయవంతంగా ముఖ్యమంత్రులను మార్చి తిరిగి అధికారంలోకి వచ్చింది. సీఎంలను మార్చే ప్రక్రియలో తమ పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తూనే అసంతృప్తులను దారిలోకి తెచ్చుకుంటోంది. అసంతృప్త నేతలెవ్వరూ పార్టీ వీడకుండా చూసుకుంటోంది.

రాజకీయాల్లో పట్టువిడుపులుండాలి. ఇగోలు డామినేట్ కాకుండా చూసుకుంటేనే పార్టీలు మనుగడ సాధిస్తాయి. అలా కాదని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఎంతపెద్ద నేతలైనా, ఎంతటి హిస్టరీ ఉన్న పార్టీ అయినా నిలవడం అసాధ్యం. మొత్తంగా రాజస్థాన్ ఎపిసోడ్‌తో అయినా హస్తం పార్టీ యాక్షన్‌లో మార్పొస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News