Rahul Gandhi: మణిపూర్ లో భారతమాతను చంపేశారు.. కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్
Rahul Gandhi: రావణుడి అహంకారమే నాడు లంకను కాల్చేసింది
Rahul Gandhi: మణిపూర్ అంశంపై లోక్ సభ దద్ధరిల్లింది. రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా టార్గెట్‌గా లోక్‌సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో రాహుల్ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అడ్డుపడ్డారు. మణిపూర్‌ను రెండుగా చీల్చారంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూస్తాన్‌ను హత్య చేశారంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను దేశద్రోహులతో పోల్చారు రాహుల్.
ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో.. మణిపూర్ అనేది ఇండియాలో భాగం కాదు అన్నారు రాహుల్. మణిపూర్‌కి తాను వెళ్లాననీ, ప్రధాని మాత్రం వెళ్లలేదని ధ్వజమెత్తారు. మణిపూర్ లో రిలీఫ్ క్యాంప్‌లో చాలా మంది మహిళలతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నట్లు చెప్పారు. మణిపూర్‌లో హిందుస్థాన్‌ని హత్య చేశారని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆందోళన చేస్తున్న వారిని స్పీకర్ వారించారు.
భారత్ మన నివాస స్థలమన్న రాహుల్ గాంధీ.. దాన్ని మణిపూర్‌లో హత్య చేశారని అన్నారు. మణిపూర్‌లో ప్రజలను చంపడం ద్వారా.. భారత్‌ని చంపినట్లైందన్నారు. మణిపూర్ ప్రజల హృదయాన్ని చంపేశారని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. దీంతో బీజేపీ సభ్యులపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు భారత దేశ హంతకులు అంటూ విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భరతమాత హత్య జరిగిందని మరోసారి రాహుల్ అన్నారు. హింసను ఆపనంతవరకూ హత్య చేస్తున్నట్లే అన్నారు రాహుల్ గాంధీ.