Priyanka Gandhi to contest Wayanad Bypoll: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చివరి లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుండి, అలాగే వయనాడ్ నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత రాయ్ బరేలీ స్థానం నుండి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ఇదే స్థానం నుండి తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు తానే అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్లనున్నారు.
గత దశాబ్ధ కాలంగా ఎన్నికలు జరిగిన ప్రతీసారి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల బరిలోకి దిగుతారు అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ అవేవీ నిజం కాలేదు. ఎట్టకేలకు వయనాడ్ నుండి ప్రియాంకా పొలిటికల్ ఫైట్ మొదలవబోతోంది.
కేరళలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటికి కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. పాలక్కడ్ అసెంబ్లీ స్థానం నుండి రాహుల్ మామ్కూటతిల్, చెలక్కర అసెంబ్లీ నియోజకవర్గం నుండి రమ్య హరిదాసుల పేర్లను ఖరారు చేసింది.
ఇవాళ మధ్యాహ్నం తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే దేశంలోని వివిధ లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికలకు సైతం తేదీలు ప్రకటించింది. అందులో భాగంగానే కేరళలో నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి.