EVMs Compared With Pagers: ఈవీఎంలు కూడా పేజర్స్ తరహాలో పేల్చేయొచ్చా? స్పందించిన ఈసీ

Update: 2024-10-15 13:52 GMT

Can EVMs be blown up like Hezbollah Pagers: కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల క్రితం లెబనాన్‌లో హెజ్బొల్లా ఉగ్రవాదులు ఉపయోగించే పేజర్లను, వాకీటాకీలను ఇజ్రాయెల్ హ్యాక్ చేసి పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాలో ఎన్నికల కోసం ఉపయోగించే ఈవీఎంలను కూడా హ్యాక్ చేయొచ్చా? పేజర్స్ తరహాలో పేల్చేయొచ్చా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు.

పేజర్స్ అన్నీ పేజర్ కమ్యునికేషన్‌లో ఒకదానినొకటి అనుసంధానమై ఉంటాయి. కానీ ఈవీఎంలు అలా కాదు. ఈవీఎంలు ఎలాంటి ఇతర పరికరాలతోనూ కనెక్ట్ అయి ఉండవు అని తేల్చిచెప్పారు. "ఈవీఎంలు ఏ ఇతర పరికరాలతోనూ కనెక్ట్ అవవు కనుక వాటిని హ్యాక్ చేయడం, ట్యాంపరింగ్ చేయడం లేదా పేల్చేయడం కుదరదు" అని రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు.

ఈవీఎంలు 7.5 వోల్ట్ అల్కలైన్ పవర్ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), అలాగే హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సరఫరా చేస్తున్నాయి. ఒక ఈవీఎంలో రెండు యూనిట్స్ ఉంటాయి. అందులో ఒకటి కంట్రోల్ యూనిట్ కాగా మరొకటి బాలటింగ్ యూనిట్ అంటారు.

బ్యాలటింగ్ యూనిట్‌పై తమకు నచ్చిన అభ్యర్థి పేరుకు పక్కనే ఉన్న నీలి రంగు బటన్ నొక్కడం ద్వారానే ఓటర్ల ఓటు నమోదవుతుంది. ఈవీఎంలలో ఉండే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం హ్యాకింగ్ చేయడానికి వీల్లేకుండా ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టంచేశారు. ఈవీఎంలు వైర్‌తో కానీ లేదా వైర్‌లెస్ పద్ధతిలో కానీ.. ఏ విధంగానూ మరే ఇతర పరికరాలు లేదా సిస్టమ్స్‌తో కనెక్ట్ అయి ఉండవు. అందువల్లే అందులో ఉన్న డేటా కూడా మార్చడానికి వీల్లేకుండా భద్రంగా ఉంటుందన్నారు. 

Tags:    

Similar News