Lawrence Bishnoi: బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో లారెన్స్ బిష్ణోయిని అదుపులోకి తీసుకోకుండా ఆపుతున్నదేంటి?
Why mumbai police not arresting Lawrence Bishnoi: బాబా సిద్ధిఖిని మర్డర్ చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది.
Why mumbai police not arresting Lawrence Bishnoi: బాబా సిద్ధిఖిని మర్డర్ చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అంతకంటే ముందు ఇదే ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది కూడా తామేనని అప్పట్లోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ రెండు నేరాలకు పాల్పడింది తామేనని స్వయంగా లారెన్స్ గ్యాంగ్ చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు లారెన్స్ బిష్ణోయ్‌ని ముంబై పోలీసులు ఎందుకు తమ అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు చాలామంది మెదళ్లని తొలిచేస్తోన్న ప్రశ్న ఇదే.
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా బయట తిరుగుతున్న వాళ్లను పట్టుకోవడం కష్టం కావొచ్చేమో కానీ ఇప్పటికే జైల్లో ఉన్న నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది ఏంటనేదే ఇప్పుడు చాలామందికి అర్థం కాని ప్రశ్న.
అయితే, వాస్తవానికి లారెన్స్ బిష్ణోయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన తరువాత అనేకసార్లు ముంబై పోలీసులు లారెన్స్ కస్టడీపై గుజరాత్ పోలీసులకు అర్జీలు పెట్టుకున్నారు. అయినప్పటికీ అతడిని ఎక్కడికీ బదిలీ చేయడానికి వీల్లేదని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఉన్నందున అక్కడి పోలీసులు అందుకు అనుమతించడం లేదని తెలుస్తున్నట్లుగా ఎన్డీటీవీ కథనం స్పష్టంచేసింది.
లారెన్స్ బిష్ణోయ్ తీహార్ నుండి గుజరాత్ జైలుకు ఎందుకెళ్లాడు, ఎందుకు అతడిని అక్కడి నుండి విడిచిపెట్టడం లేదు?
వాస్తవానికి లారెన్స్ బిష్ణోయ్ గతేడాది ఆగస్టు వరకు తీహాడ్ జైల్లో ఉన్నాడు. అయితే, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సబర్మతి జైలుకి తరలించారు. ఆ తరువాత అతడిని ఏడాది వరకు ఏ రాష్ట్ర పోలీసులు కానీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు కానీ కస్టడీకి తీసుకోవడానికి వీల్లేకుండా సీఆర్పీసీ సెక్షన్ 268(1) కింద గుజరాత్ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.
సీఆర్పీసీ సెక్షన్ 268(1) ఏం చెబుతోంది?
ఎవరైనా ఒక ఖైదీని తరలించడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్న సందర్భాల్లో ఆ ప్రయత్నాలను అడ్డుకునే అధికారాన్ని సీఆర్పీసీ సెక్షన్ 268 అక్కడి ప్రభుత్వానికి కల్పిస్తుంది. లారెన్స్ బిష్ణోయ్ విషయంలో కూడా గుజరాత్ హోంమంత్రిత్వ శాఖ ఇదే సెక్షన్‌ని ప్రయోగించింది. ఈ ఏడాది ఆగస్టుతో ఆ ఉత్తర్వులకు కాలం చెల్లినప్పటికీ.. తాజాగా మరో ఏడాది పొడిగించినట్లు తెలుస్తోంది. దీంతో లారెన్స్ బిష్ణోయ్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు సబర్మతి జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ గుజరాత్ ప్రభుత్వం తమ ఆదేశాలను రద్దు చేసుకుని అనుమతిస్తే తప్ప ఇంక ఏ పోలీసులు అతడిని తమ అదుపులోకి తీసుకోలేరు.