రజనీకాంత్ ఇంటి ఆవరణలోకి నీరు: చెన్నైను ముంచిన వర్షం..ఫ్లైఓవర్లపై కార్ల పార్కింగ్
రజనీకాంత్ ఇంటి ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.లోతట్టు ప్రాంతాల కోసం చెన్నైలో 931 పునరావాసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో 16 వేల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 65 వేల మంది సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.
చెన్నైలో 19 సెం.మీ. వర్షపాతం
చెన్నైలో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నైతో పాటు రాష్ట్రంలోని కాంచీపురం, తిరువళ్లూరు,చెంగల్పట్టు జిల్లాలకు అక్టోబర్ 16న ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నాలుగు జిల్లాల్లో అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారు.ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఫ్లైఓవర్లపై కార్ల పార్కింగ్
భారీ వర్షంతో చెన్నై రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. టీనగర్, వేలచేరి,పురుషవాకం,అన్ననగర్,కోయంబేడ్ సహా ఇతర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మెడలోతు వర్షం నీరు చేరింది. నగరంలోని సబ్ వేలను మూసివేశారు. మెట్రోరైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. గతంలో వరదల కారణంగా వాహనాలు నీటిలో మునిగి ఎందుకు పనికిరాకుండాపోయాయి. చెన్నైకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో ఫ్లైఓవర్లపై కార్లను పార్క్ చేశారు. టూ వీలర్లను యజమానులు ఇళ్లలో పార్క్ చేశారు.
వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్టాలిన్
చెన్నైలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పరిశీలించారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్షించారు. వర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని తోడేందుకు చెన్నై కార్పోరేషన్ అధికారులు బృందాలను ఏర్పాటు చేశారు.