Chennai: భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్న చెన్నై

*పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు *జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు *నిలిచిన రవాణా.. జనజీవనం అస్తవ్యస్తం

Update: 2021-11-08 03:50 GMT

భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్న చెన్నై(ఫైల్ ఫోటో)

Chennai: తమిళనాడును భారీ వర్షం అతలాకుతలం చేసింది. గత రెండ్రోజుల నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది. కొరటూర్‌, పెరంబూర్‌, అన్నాసలై, టి.నగర్‌, గిండి, అడయార్‌, పెరుంగుడి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

తమిళనాడులోని పలు జిల్లాల్లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, రాణిపేట్, తిరుపత్తూరు, కృష్ణగిరి, విల్లుపురం, కడలూరు, నీలగిరి, సేలం, ఈరోడ్, నమక్కల్, తిరుచ్చిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, వందలాది చెరువుల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో నగరం పరిసర ప్రాంతాల్లోని చెరువులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

చెన్నైకి తాగునీరు అందించే చెంబరం బాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి వరద నీటి విడుదలతో రవాణా సౌకర్యాలు స్తంభించాయి. అటు పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

భారీ వర్షాలపై అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన బృందాలను రంగంలోకి దింపింది. చెంగల్‌పట్టు, తిరువళ్లూరులో ఒక్కో బృందం, మధురైలో రెండు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కన్యాకుమారి, కాంచీపురం, మధురైలోనూ భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

చెన్నైలో మోకాలు లోతు నీటిలో వాహనాలు రాకపోకలు సాగించాయి. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో లోకల్‌ రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. చెంబక్కరపాకం, పుళల్ రిజ్వరాయర్లు నిండుకుండలా మారాయని ఏ క్షణమైనా డ్యామ్‌ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ముప్పు ఉందన్న హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తోంది.

ఇక వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం ఎంకే స్టాలిన్‌ సందర్శించారు. వరద ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా సహాయ కార్యక్రమాలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

చెన్నైతో పాటు తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ స్థాయిలను నిశితంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం స్టాలిన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేసి మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యల్లో తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఇదిలా ఉంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా తమిళనాడు, పాండిచ్చేరిలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 


Tags:    

Similar News