Electronic Devices: డిసెంబర్‌లో పెరగనున్న టీవీ, స్మార్ట్‌ఫోన్స్, రిఫ్రిజరేటర్స్, ఏసీల ధరలు
*రవాణా వ్యయాలు తగ్గినా కూడా మరింత ప్రియం కానున్న వస్త్రాలు *పెరగనున్న బెర్జర్ పెయింట్స్ ధరలు
Electronic Devices: ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి పదార్థాల రేటు పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వచ్చే నెలలోగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్లు, ఏసీల ధరలు 5 నుంచి 6 శాతం మేర పెరగొచ్చు. మరోవైపు దుస్తుల ఎగుమతిదార్లు కూడా పెద్ద బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నారు. పలు బ్రాండ్లు ధరలను నిర్ణయించే సమయంలో రవాణా వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా చైనా, హాంకాంగ్‌ల నుంచి షిప్పింగ్, విమాన రవాణా ఛార్జీలు ఆగస్టు నాటి గరిష్ఠాలతో పోలిస్తే 10 నుంచి 15శాతం తగ్గాయని ఎలక్ట్రానిక్ కంపెనీలు అంటున్నాయి. కంటైనర్ రేట్లు 7వేల డాలర్ల నుంచి 6వేల 500 డాలర్లకు తగ్గాయి. కాగా ముడిపదార్ధాల ధరలు తగ్గకపోతే, వినియోగదార్లకు ఇబ్బంది తప్పకపోవచ్చని పలు సంస్థలు చెబుతున్నాయి.
బెర్జర్ పెయింట్స్ తన కీలక ఉత్పత్తుల ధరలను డిసెంబర్‌లో 5 నుంచి 6 శాతం మేర పెంచనుంది. ముడిపదార్థాల ధరలు పెరుగుతున్నందున, మార్జిన్లను కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఇదే జరిగితే 2021-22లో కంపెనీ అయిదోసారి ధరలను పెంచినట్లవుతుంది.