ప్రధాని వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Narendra Modi: మోడీ వ్యాఖ్యలను ఖండించిన టీఆర్ఎస్, కాంగ్రెస్. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కేటీఆర్ పిలుపు.

Update: 2022-02-09 02:40 GMT

ప్రధాని వ్యాఖ్యలపై రాజకీయ దుమారం 

Narendra Modi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మోడీ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎంతో పోరాడి తాము తెలంగాణ సాధించుకుంటే రాష్ట్ర విభజన సరిగా జరగలేదని మోడీ అనడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.

మోడీ తెలంగాణను మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పార్లమెంట్ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దశాబ్దాల పోరాటం, ప్రాణ త్యాగాలను మోడీ కించపరిచారన్నారు. వెంటనే ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మలు దమనం చేయడంతో పాటు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరారు.

ప్రధాని చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. మోడీ ఈ దేశానికి ప్రధాన మంత్రి అనే విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. తాను ఇంకా గుజరాత్‌ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వ్యాప్తంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలంటూ పీసీసీ నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News