Assembly Elections 2023: పోలింగ్‌పై పెళ్లిళ్ల ఎఫెక్ట్.. అదే రోజు 50 వేలకు పైగా పెళ్లిళ్లు..
Assembly Elections 2023: ఓటింగ్ పై ప్రభావం పడే అవకాశం
Assembly Elections 2023: తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం శాసన సభల పదవీ కాలం పూర్తి కానుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలను కూడా ప్రకటించింది. ఇక దసరా తర్వాత దీపావళి సమయంలో మంచి రోజులు ఉండటంతో పెళ్లిళ్ల సీజన్ రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వివాహాలకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ముందుగా నిశ్చయం అయిన వాళ్లంతా అదే సమయంలో పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు.
అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ.. పోలింగ్ తేదీన భారీగా పెళ్లిళ్లు ఉండటంతో అటు.. పెళ్లి చేసుకునేవారితోపాటు ఎన్నికల సంఘానికి కూడా కొత్త తలనొప్పి తయారైంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23 వ తేదీన జరగనుంది. అయితే అదే రోజు రాజస్థాన్ వ్యాప్తంగా 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎన్నికల పోలింగ్, కోడ్ ఆంక్షలతో పెళ్లిళ్లు చేసుకునేవారితోపాటు వాటికి హాజరయ్యేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అటు.. ఇలా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో ఓటింగ్ శాతంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దేవ్ ఉథాని ఏకాదశి వివాహాలకు అత్యంత అనువైన రోజు అని.. అందుకే ఆ రోజు పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని పండితులు చెబుతున్నారు. అదే రోజు ఎన్నికల పోలింగ్ ఉండటంతో రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.