PM Narendra Modi: వైమానిక రంగ అభివృద్ధిపై కేంద్రం చూపు
*వడోదరాలో భారీ విమాన తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ
PM Narendra Modi: భారత వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. తాజాగా గుజరాత్‌లోని వడోదరాలో విమాన తయారీ కేంద్రానికి ప్రధాని మోడీ పునాది వేశారు. దేశ రక్షణ విభాగంలోని వైమానిక విభాగంలో ఇదే అత్యంత భారీ ప్రాజెక్టు అని ప్రధాని మోడీ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. దీంతో ఉత్పాదక రంగానికి ఈ సంస్కరణలు మరింత ఊతమిస్తాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత వైమానిక రంగం అభివృద్ధి చెందుతోందన్నారు.
ఈ రంగంలో భారత్ టాప్ త్రీలో ఉందని మోడీ వెల్లడించారు. కోవిడ్, యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభం దిశగా వెళ్తున్నా.. భారత్ ఆర్ధిక వ్యవస్థ మాత్రం అబివృద్ధి దిశగా వెళ్తోందన్నారు. రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకే వడోదరాలో సీ-295 కార్గో విమానాలను తయారుచేస్తున్నారు. టాటా ఎయిర్ బస్, రక్షణశాఖ సంయుక్తంగా ఈ తయారీ సంస్థను నిర్వహిస్తాయి. ఇందులో 40 కార్గో విమానాల తయారే లక్ష్యంగా ప్రారంభించారు. విమానాల తయారీకి ప్రైవేటు సెక్టార్‌ను ఆహ్వానించడం కూడా ఇదే తొలిసారి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు టాటా సన్స్ తెలిపారు.