ప్రధాని ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ పై సర్వత్రా ఉత్కంఠ!

Update: 2020-05-13 07:51 GMT

కరోనాతో సంక్షోభంలో చిక్కుకున్న దేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. లాక్‌డౌన్ సంగ‌త‌లా ఉంటే.. ఈ ప్యాకేజీ ప్రక‌ట‌న ఆస‌క్తికరంగా మారింది. ఇంత‌కీ ఈ ప్యాకేజీలో ఏయే రంగాల‌ను ఎలా ఆదుకుంటారు..? రాష్ట్రాల‌కు ఎలా చేయూత‌ను ఇస్తారనేది ఆస‌క్తికరమైన అంశం.

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో కేంద్రం నుంచి సాయాన్ని ఆశిస్తున్నాయి రాష్ట్రాలు. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి గుల్ల అయ్యింది. దానికి తోడు క‌రోనా వైర‌స్ సోకిన వారి చికిత్స ఖ‌ర్చులు, ఆపై క్వారెంటైన్ సెంట‌ర్లు, అద‌న‌పు ఖ‌ర్చుల‌తో రాష్ట్రాలు ఇబ్బంది ప‌డుతూ ఉన్నాయి. అన్నింటికీ మించి ఆదాయం లేక‌పోవ‌డం రాష్ట్రాల‌కు శ‌రాఘాతంగా మారింది.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు కుదేలైన వేళ దేశం కోసం ప్రధాని 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇదివరకు రిజర్వు బ్యాంకు, ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇందులో కలిసే ఉంటుందని ప్రధాని చెప్పారు. ఇప్పటికే రిజర్వు బ్యాంకు దాదాపు 4.25 లక్షల కోట్ల ప్యాకేజీ, గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఆర్థిక మంత్రి1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. తాజా ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒకేసారి ప్రకటించకపోవచ్చని దశలవారీగావెల్లడిస్తారని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.

ప్యాకేజీలో అత్యధిక కేటాయింపులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకే ఉండొచ్చని తెలుస్తోంది. దేశంలోని 7 కోట్ల మంది చిన్న వ్యాపారులకు ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలు, వ్యాపారులు, ఉద్యోగులకు బీమా, జీతాలు చెల్లించేందుకు కిరణా వ్యాపారులకు వేతన పరిరక్షణ సబ్సిడీ కావాలని ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ రంగం ప్రభుత్వాన్ని కోరింది. మొత్తం ఎంఎస్‌ఎంఈ, పరిశ్రమల రంగం కలిపి 16 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలని ప్రతిపాదించాయి. వీటిలో కొంత భాగం ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ సంస్థలకు రుణ పరిమితిలో అదనంగా 20 శాతం పెంచాలని, ప్రభుత్వం మరో 3 లక్షల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వేతన మద్దతు కింద ప్రభుత్వం నగదు సాయం ప్రకటించవచ్చని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌ఆర్‌బీఎం కింద మరిన్ని రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సడలించే ముందు వ్యవసాయ మార్కెటింగ్‌, లేబర్‌ చట్టాలు, పట్టణాభివృద్ధి, విద్యుత్తు పంపిణీ వంటి విషయాల్లో రాష్ట్రాలకు షరతులు విధిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఇందులో చేర్చొచ్చని ఆర్థిక శాఖ మాజీ అధికారి తెలిపారు.

పరిశ్రమలకు మరోసారి పెద్ద ఎత్తున పన్ను, ఇతర రాయితీలను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. రిజర్వు బ్యాంకు వివిధ వ్యాపార సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల రుణాలకు సంబంధించి పలు రాయితీలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. రైతులకు పీఎం-కిసాన్‌ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతారని, భారీ ఎత్తున నగదు బదిలీలు కూడా ఉండవచ్చని సమాచారం. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద మరో దఫా ప్యాకేజీని ప్రకటించే అవకాశాలున్నాయి.

ఉపాధి హామీ వేతనాలను మరింత పెంచడం, వ్యవసాయ పనులను పథకం పరిధిలోకి తీసుకురావడం, నిత్యావసరాలను ఉచితంగా మరికొన్ని రోజులు సరఫరా చేసే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జన్‌ధన్‌ యోజన కింద మహిళా లబ్ధిదారులకు మరింత మొత్తాన్ని బదిలీ చేసే అవకాశాలున్నాయి. మార్కెట్‌ రుణాలను కూడా 7.80 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు పెంచుకుంది. ఆర్థికంగా పూర్తిగా సమాయత్తమైన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ఖరారు చేసిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News