INS Vikrant: నేవీ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్ విక్రాంత్
INS Vikrant: కొచ్చిలో నేడు నౌకాదళానికి అప్పగించనున్న ప్రధాని మోడీ
INS Vikrant: మన దేశంలో సొంతంగా నిర్మించిన మొదటి విమాన వాహక నౌక INS విక్రాంత్ నేడు నేవీ అమ్ములపొదిలోకి చేరనుంది. దాదాపు ఏడాదిగా సముద్రంలో ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ నౌకను.. ప్రధాని మోడీ కొచ్చిలో నౌకాదళానికి అప్పగించనున్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ అప్పగింతతోపాటు.. నౌకాదళం కోసం కొత్తగా రూపొందించిన జెండాను కూడా ప్రధాని మోడీ ఇవాళ ఆవిష్కరించనున్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన INS విక్రాంత్‌ను.. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. 100 MSMEలు ఇందుకోసం విడిభాగాలు సమకూర్చాయి. 40వేల టన్నుల బరువున్న ఈ యుద్ధనౌక పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2వేల 300 కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. 17వందల మంది సిబ్బంది పని చేయవచ్చు. 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
ఒక్కసారి ఇంధనం నింపుకొంటే 7వేల 500 నాటికల్ మైళ్ల దూరం అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని రెండుసార్లు చుట్టేయగలదు. INS విక్రాంత్ నిర్మాణం 2006లో ప్రారంభమైంది. దాదాపు 20వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకలో.. 18అంతస్తులు ఉంటాయి. మిగ్-29 యుద్ధ విమానాలు, కమోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లు, తేలికపాటి హెలికాప్టర్లను ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. 1971 వార్‌లో కీలక భూమిక పోషించిన భారత తొలి విమాన వాహక నౌక INS విక్రాంత్ పేరునే.. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు ఇండియన్ నావీ పెట్టింది.
థ్రోటిల్ కంట్రోల్ రూమ్.. విక్రాంత్ నౌకకు గుండెలాంటిది ఇది. నౌకకు కావాల్సిన విద్యుత్తు సరఫరాకు అవసరమైన నాలుగు గ్యాస్ టర్బైన్ ఇంజన్లను ఈ గది నుంచే నడిపిస్తారు. ఈ నాలుగు ఇంజన్లూ కలిసి 88 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. 20 లక్షల మంది ఉండే నగరానికి సరిపోయే విద్యుత్తు అది. గాయపడ్డ సిబ్బందికి చికిత్స చేయడానికి ఈ నౌకలో 16 పడకల ఆస్పత్రి, రెండు ఆపరేషన్ థియేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కూడా ఉంటాయి. నౌకలో ఫ్లైట్ డెక్ పరిమాణం 12వేల 500 చదరపు మీటర్లు ఉంటుంది. దాదాపు రెండున్నర హాకీ మైదానాల పరిమాణం. దీన్నుంచి ఒకేసారి 12 యుద్ధవిమానాలను, ఆరు హెలికాప్టర్లను ఆపరేట్ చేయొచ్చు.