జులై 26న 21వ కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని... దేశ ప్రజలను ఉద్ద్యేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కి బాత్ ద్వారా ప్రసంగించారు. దేశానికీ ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని.. కార్గిల్ యుద్ధం ఎవరూ మరచిపోలేని పరిస్థితిలో జరిగిందని అన్నారు. భారతదేశం పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకుందని, కానీ పాకిస్థాన్ వైఖరి కారణంగా అది జరగలేదని అన్నారు. దేశ ప్రజలందరూ www.gallantryaward.gov.in ని సందర్శించి ధైర్యవంతులైన జవాన్ల గురించి చదవాలని కోరుతున్నానని అన్నారు.
కార్గిల్ పై ఎర్రకోట నుండి మాజీ ప్రధాని వాజపేయి ఇచ్చిన సందేశం ఇప్పటికి మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని అన్నారు. మనం ఏదైనా చర్యకు ఉపక్రమించబోయేముందు, కార్గిల్‌లో సైనికులు చేసిన త్యాగం ఎంతో విలువైనది అన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే దేశంలో కొనసాగుతున్న కరోనావైరస్ వ్యాప్తి గురించి మోదీ ఇలా అన్నారు..
మన కోవిడ్ -19 రికవరీ రేటు ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందని, అలాగే మరణాల రేటు కూడా తక్కువగానే ఉందన్నారు. అయినా ఒక వ్యక్తిని కూడా కోల్పోవడం బాధగా ఉంటుంది, కానీ లక్షలమంది ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గలేదన్న మోదీ.. చాలా ప్రాంతాల్లో ఇది వేగంగా వ్యాపించిందని, ఇది మునుపటిలాగే ఇంకా ప్రమాదకరమని అన్నారు. దీనిని నివారించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలని.. అలాగే గజం దూరం పాటిస్తూ ఉండాలని.. ఎప్పుడూ తమ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి సూచించారు.
ముఖానికున్న మాస్కులు తీయాలని అనిపించినప్పుడల్లా, మనకోసం పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ సైనికుల గురించి ఆలోచించాలని అన్నారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా గ్రామీణులు చేస్తున్న ప్రయత్నాలు మెచ్చుకోదగినవని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న వివిధ పరిపాలనా మరియు వినూత్న ప్రయత్నాలు వెలుగులు నింపుతాయని అన్నారు. గ్రామీణులు సానుకూల విధానంతో ఈ విపత్తును అవకాశంగా మార్చుకొని కోవిడ్ తో పోరాడుతున్నారని అన్నారు. రానున్న రక్షాబంధన్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలంతా స్థానిక వ్యాపారాలకు తోడ్పడే విధంగా లోకల్ బిజినెస్ ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సామాజిక మాధ్యమాల్లో ప్రజలంతా భారతీయ సైనిక వీరుల నైతికస్టైర్యాన్ని, స్ఫూర్తిని పెంపొందించేలా పోస్టులు పెట్టాలని ప్రధాని ప్రజలను కోరారు. ఇక జాతీయ చేనేత దినోత్సవం సమీపిస్తోందని, ఈ సందర్భంగా స్థానిక వెంచర్లు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, చేతివృత్తుల వారికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 15 న కోవిడ్ -19 పరిమితుల మధ్య స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.