బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

*296 పొడవైన రోడ్డు జాతికి అంకితం.. రూ.14,850 కోట్లతో నిర్మాణం

Update: 2022-07-16 09:51 GMT

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

Bundelkhand Expressway: యూపీలోని జులావున్‌లో 14వేల 850 కోట్ల రూపాయలతో 296 కిలోమీటర్ల పొడవున నిర్మించిన బుందెల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు.. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బుందెల్‌ఖండ్‌ గౌరవానికి సూచిక అని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి గ్రామాలకు విస్తరిస్తుందని తెలిపారు. వ్యాపార, జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటు బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేతో ఎంఎస్‌ఎంఈలు, రక్షణ తయారీకి ప్రోత్సహిస్తుందని ప్రధాని వివరించారు. ఇవాళ ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తోందని.. 75 ఏళ్ల భారత స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్లకు సంబంధించిన అభివృద్ధిపై దృష్టి సారించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేతో చిత్రకూట్‌ నుంచి ఢిల్లీకి మూడు, నాలుగు గంటల ప్రయాణ దూరం తగ్గుతుందని.. ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి మూల, ఇప్పుడు 'సబ్కా సాథ్ & సబ్‌కా వికాస్'తో, 'డబుల్ ఇంజన్' ప్రభుత్వంతో పరుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందని మోడీ వివరించారు. యూపీలోని అనేక సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని.. బుందేల్‌ఖడ్‌ ఎక్స్‌ప్రెస్‌వేతో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో యూపీలో కనెక్టవిటీ వేగవంతమైందని.. శాంతి భద్రతలు మరింత మెరుగయ్యాయని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం మెట్రో నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలకు కూడా కనెక్టివిటీని పెంచిందన్నారు.

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే యూపీలోని మూడు జిల్లాల గుండా వెళ్తోంది. 296 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిని 14వేల 850 కోట్లతో 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు 2020 ఫిబ్రవరి29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. చిత్రకూట్‌ నుంచి ఈత్వా జిల్లాల మధ్య ఈ రోడ్డు నిర్మాణాన్ని ఉత్తర ప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌వేస్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని చిన్న చిన్న నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ భారీ రోడ్డుతో ఆర్థికాభివృద్ధికి మరింత ఊపందుకోనున్నది. ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు యూపీలో నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలను మొత్తం 11 వందల 4 కిలోమీటర్ల డవున నిర్మించారు. మరో రెండు ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా పూర్తయ్యితే మొత్తం 17వందల 90 కిలోమీటర్ల పొడవున రహదారులు పూర్తవుతాయి. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరిట లక్సో నుంచి ఘాజిపూర్‌ వరకు 341 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరిట చిత్రకూట్‌ - ఈత్వా మార్గంలో 296 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేశారు. యమునా ఎక్స్‌ ప్రెస్‌వే పేరిట గ్రేటర్‌ నొయిడా, ఆగ్ర మార్గంలో 165 కిలోమీటర్లు, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పేరిట 302 కిలోమీటర్ల మేర నిర్మించారు. 92 కిలోమీటర్ల పొడవుతో గోరఖ్‌పూర్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌వే, 594 కిలోమీటర్ల పొడవుతో మీరట్‌, ప్రయాగరాజ్‌ మధ్య గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. 

Full View


Tags:    

Similar News