PM Modi 3.0: మోదీ మూడోసారి... 100 రోజుల పాలన ఎలా ఉంది?

Update: 2024-09-17 14:14 GMT

PM Modi 100 Days Report Card: నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ 16తో 100 రోజులు పూర్తయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన మరునాడే ఆయన పుట్టిన రోజు కూడా వచ్చింది. దాంతో, బీజేపీ శ్రేణులు తమ నాయకుడి పుట్టినరోజును డబుల్ బొనాంజా తరహాలో సెలబ్రేట్ చేసుకున్నాయి. ఇంతకీ, ఈ 100 రోజుల్లో ప్రధానిగా మోదీ ఏమేం చేశారు, ఎలాంటి చెప్పుకోదగిన పనులు చేశారు అనే విషయంలో కేంద్ర మంత్రులు, బీజేపి శ్రేణులు జాతీయ స్థాయిలో భారీస్థాయిలో క్యాంపెయిన్‌కి తెరతీశారు. ఏయే శాఖల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏయే భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కాయనే అంశాలను పొందుపరుస్తూ మోదీ 3.0 పేరుతో రిపోర్టు కార్డ్స్ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపి పెద్దలు ఇస్తోన్న ఆ ప్రోగ్రెస్ కార్డుల్లో ఉన్న ప్రోగ్రెస్ ఏంటనే దానిపై డీటేయిల్డ్ న్యూస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.

ప్రధాని మోదీ 2024 లోక్ సభ ఎన్నికల కంటే ముందే కేంద్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తోన్న అందరు బ్యూరోక్రాట్లకు ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అదేంటంటే.. మూడోసారి ప్రధానిగా బాధ్యత చేపట్టాక మొదటి 100 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులపై ఒక రోడ్‌మ్యాప్ డిజైన్ చేయడం.

అది ఆయనకు తన పనితీరు మీదున్న నమ్మకం కావచ్చు. ఒకవేళ ప్రభుత్వం చేతులు మారినా ప్రజల కోసం చేయాల్సిన పనులకు బ్రేక్ పడకూడదన్న ఆరాటం కావచ్చు. మొత్తానికి, అలా ఆయన అధికారంలోకి మళ్ళీ రాగానే మొదటి 100 రోజుల రోడ్ మ్యాప్ రెడీ అయింది.

ఆ మ్యాప్ ప్రకారం మోదీ ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అందులో ముఖ్యంగా రోడ్ల విస్తరణ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, 8 కొత్త రైల్వే లైన్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల అభివృద్ధి వంటి మౌళిక సౌకర్యాలకు సంబంధించిన ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి.

పట్టాలెక్కిన 15 వందే భారత్ రైళ్ళు

అదే సమయంలో 15 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. పారిశ్రామికంగా 12 స్మార్ట్ సిటీల అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం అందులో భాగంగానే తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొప్పర్తి ప్రాంతాలను కేంద్రం ఎంపిక చేసింది.

రైతులకు పెట్టుబడి సాయం

రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ప్రకటించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ కిస్తీ రైతుల ఖాతాల్లో జమ అయింది. 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 20,000 కోట్లు కేంద్రం డిపాజిట్ చేసింది. అలాగే రైతులకు మద్దతు ధర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతులకు మేలు చేసేలా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో వ్యవసాయరంగంలో స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తూ 'అగ్రిషూర్ ఫండ్' పేరుతో ఒక ఫండ్‌ని కేంద్రం ఏర్పాటు చేసింది.

70 ఏళ్ళు దాటిన వారికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్

ఆయుష్మాన్ భారత్ కింద ఇటీవలే 70 ఏళ్లు పైబడిన వారి కోసం ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ పెన్షన్ స్కీమ్ అమలుకానుంది.

అదనంగా 14,200 కోట్ల నిధులతో మరో ఏడు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యవసాయంలో రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించి, పంటల ఉత్పత్తి పెంచడం కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కూడా అందులో ఒకటి.

స్పేస్ స్టార్టప్స్ కోసం రూ. 1000 కోట్ల ఫండ్

అంతరిక్ష పరిశోధన రంగంలోకి వచ్చే స్టార్టప్స్‌కి ఊతమివ్వడం కోసం రూ.1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇన్నోవేషన్ రంగంలో వచ్చే స్టార్టప్స్‌కి ఊతమందించే లక్ష్యంతో రూపొందించిన జెనెసిస్ ప్రోగ్రాంకి (GENESIS) ఆమోదం.

రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీతో యువతలో ఉద్యోగ అవకాశాల కల్పన, నైపుణ్యశిక్షణ దిశగా మోదీ సర్కారు అడుగులేసింది.

స్వీయ ఉపాధి కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారంలో అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ముద్ర లోన్స్ కింద ఇప్పటివరకు ఇచ్చిన రూ. 10 లక్షల రుణాన్ని మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 20 లక్షలకు పెంచారు.

113 మెడికల్ కాలేజీలు.. 75,000 కొత్త సీట్లు

ఇక హెల్త్ సెక్టార్ విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా 113 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతించిన కేంద్రం, దాదాపు 75,000 అదనపు మెడికల్ సీట్లను పెంచడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఆరోగ్య భారత్ లక్ష్యాలను అందుకోవడంలో సహాయపడుతుంది అని కేంద్రం అభిప్రాయపడింది.

లడఖ్‌లో ఇప్పుడున్న లేహ్, కార్గిల్ జిల్లాలకు తోడుగా కేంద్రం కొత్తగా మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేసింది. జన్‌స్కర్, డ్రాస్, శామ్, నుబ్రా, చాంగాతాంగ్ పేరిట 5 జిల్లాలను ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు పరిపాలనను, అధికార యంత్రాంగాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.

త్రిపుర టైగర్ ఫోర్స్‌తో శాంతి ఒప్పందం

త్రిపురలో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, అలాగే ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ సంస్థలతో చేసుకున్న శాంతి ఒప్పందంపై సెప్టెంబర్ 4న కేంద్రం సంతకం చేసింది. దీంతో త్రిపురలో గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించినట్లయింది. ఈ శాంతి ఒప్పందం అనంతరం త్రిపురలో 328 సాయుధ బలగాలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లుగా ప్రకటించాయి.

సైబర్ క్రైమ్‌కు చెక్

ప్రస్తుతం దేశాన్ని వేధిస్తున్న నేరాల్లో నిత్యం వినిపిస్తున్న అంశం సైబర్ క్రైమ్. ఈ సైబర్ నేరాలను నియంత్రించేందుకు సమన్యాయ్ పేరిట ప్రజలకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే రాబోయే ఐదేళ్ల 5 వేల మంది సైబర్ కమాండోలకు శిక్షణ అందించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా సైబర్ నేరాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు సైబర్ దోస్త్ పేరిట ఒక మొబైల్ అప్లికేషన్ ని కూడా లాంచ్ చేశారు.

ప్రతిపక్షం ఏమంటోంది?

గత 100 రోజుల్లో మోదీ సర్కారు సాధించిన విజయాల గురించి బీజేపీ వర్గాలు ఇలా ఘనంగా చెప్పుకుంటుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఈసారి మోదీపాలన యూ-టర్న్ పాలన అని విమర్శిస్తోంది. లేటరల్ ఎంట్రీ, ఓపీఎస్, వక్ఫ్ బోర్డు వంటి విషయాల్లో ప్రభుత్వం యూ టర్న్ తీసుకోక తప్పలేదని, అది ప్రతిపక్షంగా తాము సాధించిన విజయమని కాంగ్రెస్ అంటోంది. యూపీఎస్సీలో లేటరల్ ఎంట్రీ అంటే.. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న వారిని కాకుండా బయటి వారిని తీసుకొచ్చి ప్రభుత్వంలోని మధ్యస్థాయి, ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించడం. సెబీ చీఫ్‌గా మాధవి పురి బుచ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఈ యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తరువాతే యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఇక ఓపీఎస్ అంటే.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అర్థం. పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన న్యూ పెన్షన్ స్కీమ్‌పై ఉద్యోగ సంఘాలతో పాటు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాతే కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త విధానాన్ని ప్రకటించింది. అయితే కేంద్రం ప్రకటించిన యూపీఎస్‌లో యూ అంటే యూటర్న్ అని అనుకోవచ్చని.. ఎందుకంటే కొత్త పెన్షన్ విధానం మళ్లీ ఓల్డ్ పెన్షన్ విధానానికి దగ్గరిగానే ఉందని కాంగ్రెస్ విమర్శించింది.

కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, దేశంలో యువతరం నిరుద్యోగ సంక్షోభంలో చిక్కుకుందని విమర్శించారు. మోదీ అస్థిర పాలన యువతను సంక్షోభంలోకి నెట్టిందని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనేత్ కూడా, మోదీ ఇష్టారాజ్యంగా వ్యవహరించే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. గతంలోని తప్పుడు నిర్ణయాల విషయంలో ఆయన యూ-టర్న్ తీసుకోక తప్పదని అన్నారు. ఈ వంద రోజుల్లో అదే జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News