గల్లాలు ఎగిరేసుకుంటూ గల్లీల్లో తిరగడం మానేద్దాం.. మూడో దశలోకి అడుగుపెట్టామా ఇక అంతే సంగతి..
బాధ్యతాయుతంగా ఉండాల్సిన సమయంలో మనం ఏం చేస్తున్నామ్? యంత్రాంగానికి మనమెలా సహకారం అందిస్తున్నామ్? ఇది ఎవరికి వారు ఆలోచించకోవాల్సిన సమయం.
బాధ్యతాయుతంగా ఉండాల్సిన సమయంలో మనం ఏం చేస్తున్నామ్? యంత్రాంగానికి మనమెలా సహకారం అందిస్తున్నామ్? ఇది ఎవరికి వారు ఆలోచించకోవాల్సిన సమయం. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిన సందర్భం. ఏ మాత్రం అలక్ష్యం చేసినా అప్రమత్తంగా లేకున్నా అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతున్న నిజం. మరి మనం ఇది పాటిస్తున్నామా మనకు బాధ్యత లేదా ఉండక్కర్లేదా? ఒక్కసారి ఆలోచించండి.!!
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా రక్కసిపై యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించని శత్రవుతో వీరోచితంగా పోరాడుతోంది. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మనం చేస్తున్నాం. వ్యాపారం ఏమైపోతుందనో, ఆదాయం ఆగిపోతుందనో, చదువులు ఆగిపోతున్నాయనో, ఇంట్లో ఊరికే కూర్చోలేకపోతున్నామనో ఇలాంటి పిచ్చి సాకులు చెబుతూ బయటకు వస్తుంటే మనమేం కావాలి. మన రాష్ట్రమేం కావాలి.
మన దేశమేం కావాలి. అనవసరంగా బయటకు వస్తున్న వారికి ఓ మాట. సమస్యలన్నీ ఏ ఒక్కరివో కాదు. మొత్తం ప్రపంచానివి. ఈ వైరస్ అంతం అయ్యే వరకూ స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఎవరి బలవంతం మీదో కాదు మన చేయాల్సింది!!. మనకు మనం పాటించాల్సిన విద్యుక్త ధర్మమిది. పాలకులు చెప్పినట్టు జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని కొనసాగిస్తే ఆపద నుంచి కచ్చితంగా గట్టెక్కుతాం. బాధ్యత గల పౌరులుగా క్రమశిక్షణగా ఉంటూ మనల్ని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాని, మన దేశాన్ని కాపాడుకుందాం.
సమస్య తీవ్రమైతే పరిస్థితి అదుపులో ఉండదు. ఈ ఒక్క మాట చాలు మనమెంత సంక్షోభ స్థితిలో ఉన్నామో చెప్పటానికి.! ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రక్కసి నిలువునా ప్రాణాలు తోడేస్తుందన్న బాధే లాక్‌డౌన్‌కు కారణమైంది. అంతేకానీ మనకు రాలేదు కదా మనమెందుకు భయపడటం అని అనుకుంటే ఎక్కడో మాటేసిన మహమ్మారి ఎక్కడి నుంచో వచ్చి మాయం చేస్తుంది. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే వచ్చే 10, 15 రోజులు మన జీవితంలో అత్యంత కీలకం. ఈ రోజుల్లో అలర్ట్‌గా ఉండి, అప్రమత్తత పాటిస్తే మహమ్మారిని మన పొలిమేర్ల నుంచి తరమి తరిమి కొట్టొచ్చు.
కరోనాను లైట్ తీసుకున్న అమెరికా, ఇటలీలో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. అత్యద్భుతమైన వ్యవస్థలు, పటిష్ఠమైన ప్రజారోగ్యం ఉన్న ఆ దేశాలే కొట్టుమిట్టాడుతున్నాయ్. మన సంగతి సరే సరి. మూడో దశలోకి అడుగుపెట్టామా ఇక అంతే సంగతి. మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే గల్లాలు ఎగిరేసుకుంటూ గల్లీల్లో తిరగడం మానేస్తేనే బెటర్. దేశంలో ఇప్పుడొక రకమైన యుద్ధ వాతావరణం ఉందన్న నిజాన్ని తెలుసుకొండి. మన యంత్రాంగానికి సహకారం అందించండి.