ప్రపంచంలోనే నాన్ వెజ్ బ్యాన్ చేసిన తొలి సిటీ పాలిటానా

పాలిటానాలో మాంసహారం బ్యాన్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతకాలం క్రితం మాంసాహారం నిషేధించాలని జైన సన్యాసులు ఆందోళన చేశారు.

Update: 2024-07-13 14:26 GMT

ప్రపంచంలోనే నాన్ వెజ్ బ్యాన్ చేసిన తొలి సిటీ పాలిటానా

పాలిటానా నగరంలో మాంసాహారాన్ని నిషేధించారు. ప్రపంచంలోనే నాన్ వెజిటేరియన్ బ్యాన్ చేసిన తొలి నగరంగా ఈ సిటీ రికార్డుల్లోకెక్కింది. జైనులకు పవిత్రమైన ప్రాంతంగా ఈ నగరానికి చరిత్ర ఉంది.



 మాంసాహారం బ్యాన్ చేసిన తొలి సిటీ పాలిటానా

పాలిటానాలో మాంసహారం బ్యాన్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతకాలం క్రితం మాంసాహారం నిషేధించాలని జైన సన్యాసులు ఆందోళన చేశారు. దీంతో మాంసం విక్రయాలు , వినియోగం అలాగే మాంసం కోసం జంతువులను చంపడాన్ని నిషేధించారు. ఈ మేరకు చట్టం చేశారు. దీంతో ఇక్కడ మాంసం క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. తొలుత మాంసాహారులు, మాంసం విక్రేతల నుండి ఈ విషయమై వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత మాంసాహారులు కూడా శాకాహారానికే పరిమితమయ్యారు.


 పాలిటానాలో మాంసాహారంపై బ్యాన్ ఎందుకు?

పాలిటానా సిటీ గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలో ఉంది. ఈ నగరం జైనులకు ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ పట్టణాన్ని జైన్ టెంపుల్ సిటీగా పిలుస్తారు. ఇక్కడ 800 ఆలయాలున్నాయి. ఇందులో ఆదినాథ్ ఆలయాన్ని జైనులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు.

అహింసకు జైనులు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని జీవుల పట్ల అహింస, కరుణను పాటించాలని జైన మతం చెబుతోంది. అందుకే శాకాహారాన్ని జైనులు సమర్ధిస్తారు. పవిత్ర దేవాలయం ఉన్న ప్రాంతంలో మాంసం కోసం జంతువులను చంపడాన్ని జైనులు వ్యతిరేకిస్తున్నారు. మాంసంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.


 పాలిటానాలో 2014 నుంచి జంతువధశాలలు మూసివేత

పాలిటానాలో మాంసం విక్రయాలు నిలిపివేయాలనే డిమాండ్ తో 2014లో 200 మంది జైన సన్యాసులు నిరహారదీక్షకు దిగారు. దీంతో ఈ నగరంలో ఉన్న జంతువధశాలలను ప్రభుత్వం మూసివేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జంతువధశాలలు తెరుచుకోలేదు. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్న 250 మాంసం దుకాణాలను ప్రభుత్వం మూసివేసింది. దీంతో మాంసం విక్రయాలు నిలిచిపోయాయి.

మాంసం విక్రయాలు లేకపోవడంతో ఈ నగరవాసులు శాకాహారానికే పరిమితమయ్యారు. పప్పు, కూరగాయలు గుజరాతీ వంటకాలైన ధోక్లా, ఫాఫ్డా వంటి ఆహార పదార్ధాలకే ప్రాధాన్యత ఇస్తారు. జైనులే కాదు ఇతర మతస్తులు కూడా మాంసం నిషేధంతో శాకాహారానికి అలవాటుపడ్డారు.


 పాలిటానాలో వెజిటేరియన్ ఫుడ్ కోర్టులు

పాలిటానాలో ఉన్న హోటల్స్ లో కూడా శాకాహారం మాత్రమే దొరుకుతుంది. మాంసంపై నిషేధం విధించినందున ఫుడ్ కోర్టుల్లో కూడా శాకాహారం మాత్రమే విక్రయిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా పాలిటానా జనాభా 64, 497. ఇందులో 75.27 శాతం మంది హిందువులు, 21.82 శాతం ముస్లింలు, 2.59 శాతం జైనులున్నారు. అయితే 2024 జనాభా లెక్కల ప్రకారంగా ఈ సిటీ జనాభా 89 వేలకు చేరింది.

గుజరాత్ లో 40 శాతం మంది మాత్రమే మాంసాహారం తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం సంస్థ బేస్ లైన్ సర్వే 2014 చెబుతుంది. పాలిటానా ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ఉంది. రాజ్ కోట్ ,వడోదర, అహ్మదాబాద్ లలో కూడా మాంసాహారం బ్యాన్ చేయాలనే డిమాండ్ నెలకొంది.


 దేశంలోని ఈ ఆరు నగరాల్లో కూడా మద్యం, లిక్కర్ పై నిషేధం

దేశంలోని రిషికేశ్, వారణాసి,హరిద్వార్, వృందావన్, అయోధ్య, మధురై లలో మాంసాహారంపై నిషేధం ఉంది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ ను హిందువులు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ మాంసం,చేపలు, గుడ్లు బహిరంగంగా విక్రయించడంపై నిషేధం ఉంది.

వారణాసితో హిందువులకు మతపరమైన, సాంస్కృతికపరమైన అనుబంధం ఉంది. ఇక్కడ అన్ని దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలకు 250 మీటర్ల దూరంలో మద్యం, మాంసాహారంపై పూర్తిగా నిషేధం ఉంది.

రిషికేష్ పవిత్ర పుణ్యక్షేత్రం. అందుకే ఈ ప్రాంతంలో మద్యం, మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు. వృందావనం శ్రీకృష్ణుడు పెరిగాడని నమ్ముతారు. ఈ నగర పంచాయతీని పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రకటించడం వల్ల మాంసాహారం, మద్యం విక్రయించరాదు.

అయోధ్య రామమందిరం చుట్టుపక్కల ఉన్న 15 కి.మీ. పరిధిలో మాంసాహార ఉత్పత్తుల అమ్మకం లేదా కొనుగోలుపై నిషేధం విధించారు. ఈ ప్రాంతంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై కూడా బ్యాన్ ఉంది. మధురై మీనాక్షి ఆలయం వద్ద కూడా మాంసాహారంపై నిషేధం ఉంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ బేస్ లైన్ సర్వే 2014 ప్రకారంగా గుజరాతీలలో దాదాపుగా 40 శాతం మంది మాంసం వినియోగిస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News