Online Fraud: పది నెలల్లో రూ.4245కోట్లు అమాయకుల నుంచి దోచుకున్న మోసగాళ్లు
Online Fraud: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు స్కామర్ల ఉచ్చులో చిక్కుకుని కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటుున్నారు.

Online Fraud: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు స్కామర్ల ఉచ్చులో చిక్కుకుని కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటుున్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం.. 2024-25 మొదటి 10 నెలల్లో డిజిటల్ ఆర్థిక మోసం కారణంగా ప్రజలు రూ.4245 కోట్లు కోల్పోయారు.
2022-2023లో 2 మిలియన్ (సుమారు 20 లక్షలు) కేసులు నమోదయ్యాయని, ఇందులో ప్రజలు రూ. 2537 కోట్లు కోల్పోయారు. 2023-2024లో 28 లక్షలకు పైగా ఆర్థిక మోసాల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో స్కామర్లు ప్రజల ఖాతాల నుండి రూ.4403 కోట్లు కొట్టేశారు. పేమెంట్స్ సంబంధిత మోసాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిపోర్టింగ్ సిస్టమ్ రెడీ చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ జారీ చేసేవారు.. నాన్-బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు ఈ సిస్టమ్ ద్వారా మోసపూరిత ఘటనలను నివేదించవచ్చు.
ఆర్థిక మోసాలను సత్వరమే నివేదించడానికి... మోసగాళ్ళు నిధులను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి సిజిటన్ ఫైనాన్షియల్ సైబర్‌ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 1.3 మిలియన్ ఫిర్యాదుల ఆధారంగా ఈ వ్యవస్థ ద్వారా దాదాపు రూ.4386 కోట్లు ఆదా అయ్యాయి. డిజిటల్ ఆర్థిక మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం, ఆర్‌బిఐ , నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అనేక చర్యలు తీసుకున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు.
ఆన్‌లైన్ మోసాలను నివారించాలనుకుంటే, అనుమానాస్పద ఇమెయిల్‌లు, సందేశాలపై క్లిక్ చేయవద్దు. దీనితో పాటు ఓపెన్ చేసే వెబ్‌సైట్ నిజంగా నమ్మదగినదా కాదా అని కన్ఫాం చేసుకోవాలి. మీ అకౌంట్ కు స్ట్రాంగ్ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ స్కామ్ ఫిర్యాదు నంబర్
మీకు లేదా మీకు తెలిసిన వారికి ఆన్‌లైన్ స్కామ్ జరిగితే, స్కామ్ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడానికి మీరు ఏ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలో ముందుగానే తెలుసుకోవాలి. మీరు 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్) కు కాల్ చేసి మీకు జరిగిన సంఘటన గురించి సమాచారం అందించి ఫిర్యాదు చేయవచ్చు.