Raksha Bandhan 2023: రాఖీ సందర్భంగా మార్కెట్లో వెరైటీ రాఖీలు కనువిందు
Raksha Bandhan 2023: పండగకు కొన్నివారాల ముందు నుంచే విభిన్న రాఖీలు దర్శనం
Raksha Bandhan 2023: అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పండగ రాఖీ పూర్ణిమ. అక్కా, చెల్లెళ్లు.. తమ సోదరులకు రాఖీ కట్టీ తమకు బలాన్నివ్వాలని కోరుకుంటారు. నేను నీకు రక్షగా ఉంటానన్న నమ్మకాన్ని సోదరులు ఇస్తుంటారు. మరి రాఖీ పండగ వచ్చేస్తోంది. అయితే, రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లో వెరైటీ రాఖీలు సందడి చేస్తున్నాయి. అసలు ఈ రాఖీలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందా.
రాఖీ పండగ వస్తుందంటే కొన్నివారాల ముందు నుంచే మార్కెట్‌లో విభిన్న రకాల డిజైన్ల రాఖీలు దర్శనమిస్తుంటాయి. డిఫరెంట్ టైప్స్ రాఖీలు అందుబాటులోకి వస్తాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా సరికొత్త రాఖీలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. రాఖీల తయారీకి పేరుగాంచిన ధూల్‌పేట్ లో రకరకాల రాఖీలను రూపొందిస్తున్నారు.
రాఖీ పండగను జరుపుకునేది ఒక రోజు మాత్రమే అయినా, వాటి తయారీ విధానం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంటుందన్నారు తయారీదారులు. దాదాపు తొమ్మిది నెలలపాటు తయారీలో నిమగ్నమవుతామని తెలుపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అందరికీ నచ్చేలా నూతన డిజైన్లలో రాఖీలను తయారు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో నూతనంగా, వెరైటీగా ఉండాలనే యువత ఆలోచనలకు అనుగుణంగా వీటిని సిద్ధం చేస్తున్నారు.
తమ సోదరులకు కట్టే రాఖీలు వెరైటీగా ఉండాలని సోదరీమణులు ఆకాంక్షిస్తారు. వారి అభిలాషలకు అనుగుణంగా తయారీదారులు సైతం సరికొత్త డిజైన్లతో వాటిని రూపొందిస్తున్నారు. రంగు, రంగుల దారాలు, పలు రకాల పూసలు, వెండి రాఖీలు, బంగారు పూతతో తయారు చేసిన వివిధ ఆకృతుల రాఖీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రాఖీలు కనిపిస్తాయని, ఈసారి సరికొత్త డిజైన్లలో రాఖీలను చేశామని చెప్తున్నారు. దాదాపు వెయ్యికి పైగా డిజైన్స్‌లో రాఖీలు తయారు చేశారు. ఇక్కడ రాఖీలు తయారీ ప్రక్రియలో దాదాపు పదిహేను వందల మంది పనిచేస్తుంటారు.
ప్రత్యేకమైన రాఖీలు తయారు చేయడమే కాదు వాటికి తగ్గట్టుగానే ధరలు కూడా ఉంటున్నాయి. అయితే తమకు నచ్చిన రాఖీల కోసం కొందరు విక్రయదారులు ముందుగానే తయారీదారులను సంప్రదిస్తున్నారు. మార్కెట్‌లో ట్రెండ్‌కు తగ్గట్టుగా రాఖీలకు ఆర్డర్స్ ఇచ్చి తయారుచేయించుకుంటున్నారు.
ఇక సిటీ వ్యాప్తంగానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి పెద్దమొత్తంలో రాఖీలను ఆర్డర్ ఇస్తుంటారు. ధూల్‌పేట ప్రాంతాల్లో తయారైన రాఖీలను కొనుగోలు చేసేందుకు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈసారి ఇంట్రెస్టింగ్ మోడల్స్‌తో కలర్‌ఫుల్‌గా, ఫ్యాన్సీ టైప్, స్టోన్ టైప్, విభిన్న రకాల రాఖీలు డిజైన్ తయారు చేయడంతో గిరాకీ బాగుందంటున్నారు వ్యాపారస్తులు.