Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
Omicron: ఒమిక్రాన్ కేసులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి.
Omicron: ఒమిక్రాన్ కేసులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో టెస్టుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారికి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నప్పటికీ PCR టెస్టుల్లో వీటిని గుర్తించడం కష్టంగా మారింది. ఒమిక్రాన్ నిర్ధారించేందుకు పాజిటివ్ వచ్చిన నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ అంతా మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు గంటల్లోనే ఒమిక్రాన్‌ను గుర్తించే టెస్ట్ కిట్‌ను ICMR అభివృద్ధి చేసింది. ల్యాబ్‌లలోనే అందుబాటులో ఉండే ఈ కిట్‌ల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను అతితక్కువ సమయంలోనే గుర్తించవచ్చని ICMR శాస్త్రవేత్తలు అంటున్నారు.
డాక్టర్ బిశ్వజ్యోతి బోర్కకోటి ఆధ్వర్యంలో నిపుణుల బృందం రూపొందించిన ఈ కిట్‌ను వెయ్యి మంది కొవిడ్ బాధితుల నమూనాలపై పరీక్షించారు. వీటిలో కచ్చితమైన ఫలితాలను వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీటి లైసెన్సు జారీ ప్రక్రియ కొనసాగుతోందని వచ్చే వారంలోనే ఈ కిట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ICMR శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక ఈ కిట్‌లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కోల్‌కతాకు చెందిన GCC బయోటెక్‌తో ICMR ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇవి యాంటీజెన్ టెస్ట్ కిట్‌ల మాదిరిగా ఎక్కడైనా ఉపయోగించే పరిస్థితి లేదు. కేవలం RT-PCR పరీక్షలు చేసే కేంద్రాల్లోనే ఈ టెస్టు కిట్‌లు అందుబాటులోకి రానున్నాయి.