Rehana Fathima: నగ్నత్వం, అశ్లీలత ఒక్కటి కాదు: రెహాన ఫాతిమాకు ఊరటనిస్తూ కేరళ హై కోర్టు సంచలన తీర్పు

Rehana Fathima: కేరళకు చెందిన రెహానా ఫాతిమా అర్థనగ్న భంగిమలో తన మైనర్ పిల్లలతో తన శరీరం పై పెయింట్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.

Update: 2023-06-06 09:52 GMT

Rehana Fathima: నగ్నత్వం, అశ్లీలత ఒక్కటి కాదు: రెహాన ఫాతిమాకు ఊరటనిస్తూ కేరళ హై కోర్టు సంచలన తీర్పు

Rehana Fathima: కేరళ హై కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. నగ్నత్వం, అశ్లీలత రెండు ఒకటి కాదని, నగ్నత్వాన్ని అశ్లీలతను ముడిపెట్టరాదని తేల్చి చెబుతూ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా పై పెట్టిన కేసును జస్టిస్ కౌసర్ ఎడగప్పత్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. లింగ బేధంతో సంబంధం లేకుండా, వ్యక్తులందరూ తమ శరీరానికి స్వయంప్రతిపత్తికి అర్హులని, అయితే మహిళలు తరచుగా ఈ హక్కును కోల్పోతున్నారని కోర్టు ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం.

అసలు వివాదం ఏంటి..??

కేరళకు చెందిన రెహానా ఫాతిమా అర్థనగ్న భంగిమలో తన మైనర్ పిల్లలతో తన శరీరం పై పెయింట్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో ఫాతిమాపై ఫోక్సో, జువైనల్ జస్టిస్, ఐటీ చట్టాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా..దిగువ కోర్టు ఫాతిమా అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టులో సవాలు చేశారు.

ఇరు పక్షాల వాదన ఏంటంటే..

కేసు విచారణలో భాగంగా ఫాతిమా పెయింటింగ్ కోసం తన శరీర పైభాగాన్ని ప్రదర్శించిందని, ఇది అశ్లీలం అవుతుందని ప్రాసిక్యూషన్ వాదించింది. మరోవైపు శరీరం ఎగువ భాగాల అర్థనగ్నత్వం విషయంలో పురుషులు, మహిళలను వేర్వేరు దృష్టి కోణాలలో చూస్తున్నారని ఫాతిమా తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూ సందేశం ఇచ్చేందుకే తన క్లయింట్ బాడీ పెయింటింగ్ కళను వినియోగించినట్లు స్పష్టం చేశారు. 

హై కోర్టు తుది తీర్పు:

ఇరు పక్షాల వాదనలు విన్న కేరళ హై కోర్టు ఒక సామాజిక లక్ష్యం కోసమే ఫాతిమా వీడియోను రూపొందించారని, దీన్ని అవగాహన చేసుకోవడంలో దిగువ కోర్టు విఫలం అయిందని పేర్కొంటూ ఆమెపై నమోదు చేసిన కేసులన్నింటిని రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, సమానత్వం, గోపత్య కోసం ప్రాథమిక హక్కులో తన శరీరం గురించి స్వయంప్రతిపత్తి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి స్త్రీకి ఉంటుందని..ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి కూడా వస్తుందని న్యాయమూర్తి కౌసర్ ఎడగప్పత్ స్పష్టం చేశారు.

ఫాతిమా తన శరీరాన్ని తన పిల్లలు కాన్వాస్ లా ఉపయోగించుకోనిచ్చింది తప్ప..తన లైంగిక ఉద్రేకాలను తృప్తిపరుచుకునేందుకు కాదని స్పష్టంగా తెలుస్తోందని..వీడియోలో లైంగిక వాంఛ గురించి ఎలాంటి సూచల లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నగ్నత్వం, అశ్లీలతను ఒక్కటి కాదనే విషయాన్ని గుర్తించాలని న్యాయస్థానం పేర్కొంది.

ఎవరీ రెహానా ఫాతిమా:

కేరళకు చెందిన రెహానా ఫాతిమా హక్కుల కార్యకర్త. ఈమెకు సూర్య గాయత్రి అని మరో పేరు కూడా ఉంది. మోడలింగ్ రంగంలో పని చేస్తున్న రెహానా ఫాతిమా గత కొన్నేళ్లుగా సమానత్వం, స్వేచ్ఛ నినాదాలతో పోరాటం చేస్తున్నారు. గతంలో కేరళ ప్రభుత్వ నైతిక పోలీసింగ్ కు వ్యతిరేకంగా ఆమె కిస్ ఆఫ్ లవ్ ఆందోళనలో పాల్గొన్నారు. 2016లో అయ్యంథోల్ పులి కాళి పండుగలో పాల్గొన్న మొదటి మహిళ ఈమె. 2018లో ఓ ప్రొఫెసర్ నిర్వాకానికి వ్యతిరేకంగా తన ఛాతీపై పుచ్చకాయలను పట్టుకొని బేర్ ది చెస్ట్ ప్రచారం నిర్వహించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించరని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగానే మహిళలు సైతం శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అర్హులేనంటూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ద్వారానే ఫాతిమా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 

Tags:    

Similar News