వేతన జీవులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపునిచ్చారు. 5 లక్షల నుంచి 7.5లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను విధించనున్నట్లు లోక్‌సభలో ప్రకటించారు.
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట
ఆదాయపన్ను చెల్లింపుదారులపై కేంద్రం వరాలు
ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. ఆదాయ పన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సున్నా నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదని స్పష్టం చేశారు. అదే విధంగా... కార్పొరేట్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ మేరకు కార్పొరేట్ ట్యాక్స్‌లను 15 శాతం తగ్గించింది. కార్పొరేట్ ట్యాక్సులను తగ్గించడం చారిత్రక నిర్ణయమని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రపంచంలో అతి తక్కువ కార్పొరేట్ పన్నులు ఉన్న దేశం భారత్ అని చెప్పారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్‌ఛేంజ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు, ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు చేస్తామని చెప్పారు.
ఇక ఎవరికి ఎంత పన్ను విధిస్తున్నారో కూడా మంత్రి వివరణ ఇచ్చారు. 5 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లించనక్కర్లేదు. 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం పన్ను, 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం పన్ను, 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను, 15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను ఉంటుందని ఆర్థికమంత్రి లెక్కలు అప్పగించారు.
పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు ఆమె చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమేనని స్పష్టం చేశారు. దీంతో.. పాత, కొత్త ట్యాక్స్ విధానాలు అమలులో ఉండనున్నట్లు స్పష్టమైంది. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావని కేంద్రం తెలిపింది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మరో ఏడాది పాటు పన్ను మినహాస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.
మొత్తానికి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకూ 20 శాతం పన్ను ఉండగా, అదికాస్త ఇప్పుడు 10 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.