Mizoram: మిజోరాం నుంచి మైతీల తిరుగు పయనం..
Mizoram: ఆదివారం మిజోరాం నుంచి ఇంఫాల్ చేరుకున్న 58 మంది
Mizoram: మణిపూర్‌లో హింసాత్మక ఘటనల ప్రభావం మిజోరాంలో మైతీలను ఆందోళనకు గురిచేస్తోంది. మిజోరాంలో ఉన్న మైతీలకు అక్కడి కుకీ అనుకూల వర్గంతో ముప్పంటూ వచ్చిన ప్రకటనలతో ఆందోళన నెలకొంది. దీంతో తిరుగుబాట పట్టారు మైతీలు. నిన్న కొందరు ఐజాల్ నుంచి మణిపూర్‌కు చేరుకున్నారు.
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై అమానవీయంగా ప్రవర్తించగా.. దీనిపై మిజోరాంలోని ఓ మాజీ మిలిటెంట్ గ్రూప్ స్పందించింది. మిజోరాంలో ఉన్న మణిపూర్‌కు చెందిన మైతీలు వారి సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని తెలిపింది. మే 4న జరిగిన అమానుష సంఘటనపై మిజోరాంలోని కుకీలకు అనుకూలంగా ఉన్న యువత ఆగ్రహంతో ఉన్నారని.. మైతీలపై దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు పీస్ అకార్డ్ MNF రిటర్నీస్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.
మిజోరాంలోని ప్రభావవంతమైన సివిల్ సొసైటీ గ్రూప్, సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ కూడా మైతీలకు సూచనలు జారీ చేసింది. ఈ ప్రకటనలు మైతీల్లో ఆందోళన రేకెత్తించగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. మైతీలకు రక్షణ కల్పిస్తామని ప్రకటన చేశారు. మిజోరాంలో మైతీ వర్గానికి చెందిన 2వేల మంది నివసిస్తున్నారు. వారందరికీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినా మైతీలు ఇంటిబాట పట్టేందుకే సిద్ధమయ్యారు. ఆదివారం మిజోరాంలోని అయిజాల్ నగరం నుంచి 58 మంది మైతీలు మణిపూర్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా వారు మాత్రం మణిపూర్ వెళ్లేందుకే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.