Man Dating Woman: ఫోన్ చేసి డేటింగ్ కోసం రమ్మని చెప్పిన మహిళ.. పౌడర్, సెంట్ కొట్టుకుని వెళ్లి కిడ్నాప్ అయ్యారు
Man Dating Woman: క్రైమ్ స్టోరీలందు ఈ వెరైటీ క్రైమ్ స్టోరీ వేరు. ఎందుకంటే ఈ నేరంలో మోసం చేసిన వారి కంటే మోసపోయిన వ్యక్తి తొందరపాటే ఎక్కువగా కనిపిస్తుంది. డేటింగ్ కోసం రమ్మని చెప్పిన ఒక మహిళ చేతిలో మోసపోయిన ఓ 50 ఏళ్ల వ్యక్తి క్రైమ్ కహాని ఇది. అసలేం జరిగిందో తెలియాలంటే వెంటనే డీటేయిల్స్‌లోకి వెళ్లాల్సిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీకి సమీపంలోని లలిత్‌పూర్‌లో జరిగిన ఘటన ఇది.
లలిత్‌పూర్‌కు చెందిన లల్లు చౌబేకు ఒక గుర్తుతెలియని మహిళ నుండి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఝాన్సీకి వస్తే డేటింగ్ చేసుకుందాం రమ్మని ఆ మహిళ చెప్పారు. మహిళనే స్వయంగా ఫోన్ చేసి డేటింగ్‌కు రమ్మని చెప్పడంతో లల్లూ చౌబే ఆనందానికి అడ్డూ అదుపులేకుండా పోయింది. వెంటనే నీట్‌గా రెడీ అయి పౌడర్, సెంట్ కొట్టుకుని ఝాన్సీకి బయల్దేరారు. తీరా అక్కడికి వెళ్లాక తెలిసిందే.. అది తనను ట్రాప్ చేయడానికి చేసిన ఫోన్ కాల్ అని. కానీ అప్పటికే ఆ మహిళతో కలిసి పనిచేస్తున్న ఒక ముఠా చౌబేను కిడ్నాప్ చేసింది.
లల్లూ చౌబేను కిడ్నాప్ చేసిన ఆ ముఠా, చౌబే కొడుక్కు ఫోన్ చేసింది. మీ నాన్నను కిడ్నాప్ చేశామని, రూ. 3 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని ఆ ముఠా హెచ్చరించింది. ముఠా నుండి ఫోన్ కాల్ రావడంతోనే చౌబే కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి చౌబే కిడ్నాపర్స్ ఆచూకీ కోసం అన్వేషించడం మొదలుపెట్టారు.
గురువారం చౌబే కిడ్నాప్ జరిగింది. శనివారం నాటికి అప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. నిందితులకు ఆన్‌లైన్ ద్వారా 1 లక్ష నగదు కూడా పంపించారు. పోలీసులే ఈసారి బృందాలుగా విడిపోయి గాలింపు ముమ్మరం చేశారు. చౌబే కుమారుడి గెటప్‌లో ఒక కానిస్టేబుల్ క్యాష్ తీసుకుని వెళ్లారు.
కానిస్టేబుల్‌ను చూసి ఆయనే చౌబే కుమారుడని నమ్మిన నిందితులు ఆయన్ని తమ గ్యాంగ్ లీడర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ వెంటనే పోలీసులు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి నిందితులను అరెస్ట్ చేశారు. అప్పుడే తెలిసింది.. ఆ ముఠా మహిళలతో ఫోన్ కాల్స్ చేయించి, డేటింగ్ కోసం వచ్చిన వ్యక్తులను ఇలా బందించి వారి కుటుంబాల నుండి డబ్బులు గుంజుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలా చాలామంది మహిళలు ఆ ముఠా కోసం పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే లేడీస్ పిలిచారు కదా అని వెనుకాముందు చూసుకోకుండా తొందరపడితే ఇలాంటి ముఠాల చేతికి చిక్కే ప్రమాదం లేకపోలేదంటున్నారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు.