సైరన్‌ మోగితే... సెల్‌ఫోన్లు స్విచ్చాఫే.. మొహిత్యాంచే వడ్గావ్‌లో డిజిటల్‌ డిటాక్స్‌

*డిజిటల్‌ డిటాక్స్‌ అంటే.. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను... కొంత సమయం వరకు స్విచ్ఛాఫ్‌ చేయడమే

Update: 2022-09-27 13:30 GMT

సైరన్‌ మోగితే... సెల్‌ఫోన్లు స్విచ్చాఫే.. మొహిత్యాంచే వడ్గావ్‌లో డిజిటల్‌ డిటాక్స్‌

Digital Detox: ఇప్పుడుంతా డిజిటల్‌ యుగం నడుస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా.. నిమిష నిమిషానికి సెల్‌ఫోన్‌ను చూడడం పరిపాటిగా మారింది. కొందరైతే గంటల తరబడి.. ఫోన్‌లోనే మునిగిపోతారు. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉన్నా.. ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. దీని మనుషుల మధ్య దూరం పెరుగుతోందని, బద్దకం అధికమవుతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధే.. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో మొహిత్యాంచే వడ్గావ్‌ అనే గ్రామ సర్పంచ్‌ విజయ్‌ మోహితేకు కూడా కలిగింది. దీంతో గ్రామస్థులంతా కలిసి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నిత్యం గంటన్నర పాటు ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలని శపథం చేశారు. మరి ఆ సమయంలో గ్రామస్థులంతా ఏం చేస్తారు? ఈ నిర్ణయంతో గ్రామంలో ఏం జరుగుతోంది.

ప్రస్తుతం మనం డిజిటల్‌ యుగంలో గడుపుతున్నాం.. దశాబ్దాల క్రితం కనీసం ఊహకైనా తట్టని.. సౌకర్యాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.. నిమిష నిమిషానికి సెల్‌ఫోన్‌ స్ర్కీన్‌ చూడడం దైనందిత జీవితంలో భాగమైపోయింది. పక్క రూమ్‌లో ఉన్న సోదరినో.. సోదరుడినో పిలవమని అమ్మ చెప్తే... అమ్మ పిలుస్తున్నదని వాట్సాప్‌ మెస్సేజ్‌ చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు.. 24 గంటలు సెల్‌ఫోన్లు, లేదంటే టీవీలను అంటిపెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎందరు ఉన్నా.. ఎవరికి వారు ఫోన్లను పట్టుకుని కూర్చుంటున్నారు. దీంతో మనుషుల మధ్య సంబంధాలు ఆందోళనకర పిరిస్థితికి చేరుకుంటున్నాయి. ఈ సెల్‌ఫోన్లు లేని సమయంలో.. ప్రశాంతంగా ఇరుగుపొరుగుతో ముచ్చట్లు పెట్టుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. అదే సమయంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమై.. చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. దీంతో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంత స్థితికి చేరుకున్నారు. దీనికి తోడన్నట్టు కరోనా వైరస్‌ రావడంతో.. మనిషి.. మనిషిని కలుసుకోవడం కూడా కష్టమైపోయింది. ఒకే గదిలో గంటల తరబడి గడపాల్సి రావడంతో.. గత్యంతరం లేక.. సెల్‌ఫోన్లు, టీవీలకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు.

ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు వ్యసనంలా మారడంతో మానవ సంబంధాలు దెబ్బతినడంతో పాటు ఆరోగ్య, సామాజిక రుగ్మతలు అధిమవుతున్నాయి. కంటి చూపు మందగించడం.. ప్రతిదానికి ఆన్‌లైన్‌లో వెతకడంతో.. మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాదు.. నిద్రమానుకుని మరీ.. సెల్‌పోన్లను చూడడంతో మానసిక ఒత్తిడి కూడా అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు... రోజులో కొంత సమయమైనా.. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలంటూ.. మానసిక, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య అధికమవుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆధునిక సాంకేతికత మనిషి పురోగతికి మేలు చేయకపోగా.. మరింత కీడు చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆవేదనే మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలోని మొహిత్యాంచే వడ్గావ్‌ అనే గ్రామ సర్పంచ్‌ విజయ్‌ మొహిత్‌ కూడా కలిగింది. దీంతో పరిస్థితులను మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు గ్రామస్థులనంతా సమావేశ పరిచి.. ఇదే విషయాన్ని చర్చించారు. అందుకు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకు మొహిత్యాంచే వడ్గావ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దాని ద్వారా ఏం సాధించాలనుకున్నారు?

మొహిత్యాంచే వడ్గావ్‌ గ్రామంలో డిజిటల్‌ డిటాక్స్‌ అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. డిజిటల్‌ డిటాక్స్‌ అంటే.. అదేదో విచిత్రమైన నిర్ణయం కాదు.. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను కొంత సమయం వరకు పక్కన పెట్టడమే... ప్రతి రోజు రాత్రి 7 గంటలకు గ్రామంలోని ఆలయంలో ఓ సైరన్‌ మోగుతోంది. ఆ సిగ్నల్‌ అందుకుని.. గ్రామస్థులంతా రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటలకు రెండో సైరన్‌ మోగే వరకు గ్రామస్థులంతా.. తమ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలతో సహా.. తమ వద్ద ఉన్న అన్ని డిజిటల్‌ పరికరాలను స్విచ్ఛాఫ్‌ చేస్తారు. డిజిటల్‌ డిటాక్స్‌తో కలిగే మేలును సర్పంచ్‌ విజయ్‌ మొహిత్‌ గ్రామస్థులకు వివరించాడు. దీంతో వారంతా సమష్టిగా ఈ నిర్ణయానికి అంగీకరించారు. డిజిటల్‌ డిటాక్స్‌ అమలు చేస్తున్న సమయంలో అంటే.. రాత్రి 7 నుంచి 8.30 నిమిషాల వరకు అందరూ.. ఇరుగుపొరుగువారితోనో.. స్నేహితులతోనో ముచ్చటించడానికి కేటాయిస్తారు. మరి కొందరు మాత్రం పుస్తకాలను చదవడానికి.. పిల్లలను చదివించడానికి కేటాయిస్తున్నారు. దీంతో గ్రామస్థుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయని మొహిత్యాంచే వడ్గావ్‌ గ్రామస్థులు చెబుతున్నారు.

కరోనా లాక్‌డౌన్‌ అనంతరం పరిస్థితులు మారాయని గ్రామ సర్పంచ్‌ విజయ్‌ మొహిత్‌ చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు రావడంతో.. మొబైల్‌ ఫోన్లను పిల్లలకు అప్పగించి.. తల్లిదండ్రులు టీవీలకు అతుక్కుపోయిన విషయాన్ని విజయ్‌ గుర్తు చేస్తున్నారు. తిరిగి భౌతిక తరగతులు మొదలైనా.. పిల్లలో ఇంకా బద్ధకం ఉన్నట్టు ఉపాధ్యాయులు గుర్తించిన విషయాన్ని విజయ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ డిటాక్స్‌ అనే ఆలోచన వచ్చిందని విజయ్ చెబుతున్నారు. డిజిటల్‌ డిటాక్స్‌ను పర్యవేక్షించేందుకు వార్డు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో సభ్యులు డిజిటల్‌ డిటాక్స్‌ను అమలయ్యేలా చూస్తారు. అయితే ఇది సర్పంచ్‌ ఒక్కడి విజయం ఏ మాత్రం కాదు.. గ్రామస్థులంతా ఐక్యమత్యంగా ఉండడమే అందుకు కారణం.. ఇప్పటికే మొహిత్యాంచే వడ్గావ్‌ గ్రామానికి స్వచ్ఛ జాతీయ పురస్కారం దక్కింది. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడలో సర్పంచ్‌కు అక్కడి ప్రజలు సహకరించారు. అంతేకాదు.. మొహిత్యాంచే వడ్గావ్‌ గ్రామానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.. ఎందరో స్వాతంత్ర ఉద్యమ వీరులకు ఈ గ్రామం పుట్టినిల్లు. ఇప్పుడు డిజిటల్‌ డిటాక్స్‌లోనూ మొహిత్యాంచే వడ్గావ్‌ గ్రామం విజయం సాధించింది. నిత్యం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు క్రమం తప్పకుండా ఈ డిజిటల్‌ డిటాక్స్‌ను అమలు చేస్తున్నారు.

ఏదేమైనా డిజిటల్‌ డిటాక్స్‌ను అందరూ విధిగా పాటిస్తే.. సామాజిక పరిస్థితులు మెరుగుపడతాయని సామాజిక వేత్తలు చెబుతున్నారు. రోజులో కనీసం గంటైనా పాటిస్తే.. అటు కరెంటు వినియోగం తగ్గుతుందని.. దాంతో డబ్బు కూడా ఆదా అవుతుందని వివరిస్తున్నారు.  

Tags:    

Similar News