థానే మున్సిపల్ కార్పొరేటర్ నుంచి సీఎం వరకు.. అనూహ్యంగా దూసుకొచ్చిన షిండే పేరు
Eknath Shinde Maharashtra New CM: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏక్నాథ్ షిండే.
Eknath Shinde Maharashtra New CM: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏక్నాథ్ షిండే. తిరుగుబాటు నేత నుంచి ముఖ్యమంత్రి పీఠంవైపు అనూహ్యంగా ఎదిగారు. శివసేన రాజకీయాలను వెనకనుంచి నడిపిస్తున్న మరాఠా యోధుడు శరద్‌పవార్ కూడా ఊహించని విధంగా షిండే రాష్ట్రంలో అత్యున్నత పదవిని అందుకుంటున్నారు. మరి షిండే ఎవరు? ఆయన వ్యక్తిగత జవితంలోని విశేషాలేంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
షిండే పూర్తి పేరు ఏక్నాథ్ శంభాజీ షిండే. 1964లో ఫిబ్రవరి 9న థానే జిల్లాలో షిండే జన్మించారు. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. థానే జిల్లాలోని కోప్రి-పచ్పఖాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ రోడ్డు రవాణా శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం థానే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొదలైంది. రెండుసార్లు థానే మున్సిపల్ కార్పొరేటర్‌గా పని చేశారు. అక్కడే మూడేళ్లపాటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా యాక్టివ్ రోల్ పోషించారు. అంతేకాదు నాలుగేళ్లు సభా నాయకుడిగానూ పనిచేశారు.
ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాని షిండే.. ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలవడానికి కారణం.. అతను ఎంచుకున్న పంథానే అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. బాలాసాహెబ్ థాకరే భావజాలానికి ప్రభావితుడైన షిండే మొదట్నుంచీ హిందూ భావాలతోనే కొనసాగుతూ వస్తున్నారు. శివసేన భావజాలంతో మమేకమయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ముందుగా అనుకున్న ప్రకారం బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి రావాల్సి ఉండగా పవార్ చాణక్యంతో బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలోకి రావడం షిండేకు రుచించలేదు. ఇది మహారాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమేనని బలంగా భావించిన షిండే తన అభిప్రాయాలతో ఏకీభావం ఉన్న ఇతర నేతలను కలుపుకొని తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇందుకు తెరవెనుక నుంచి బీజేపీ సహకారం పుష్కలంగా లభించి ఇప్పుడు సీఎం అవుతున్నారు.