Maharashtra Exit Polls: మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? విజయం ఎవరిని వరించనుంది?
Maharashtra Exit Polls: మహారాష్ట్రలో ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ముగియడంతో మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. మొత్తం ఏడు ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో నాలుగు ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి సర్కారే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. మరో రెండు ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో హంగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
మ్యాట్రిజ్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపి, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) కలిసి పోటీ చేసిన అధికార కూటమికి 150 - 170 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపక్షాల కూటమికి 130 స్థానాల్లోనే విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఇదే మహయుతి కూటమికి 175-195 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్షాల కూటమి విషయానికొస్తే.. వారు కేవలం 112 స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడింది.
పి-మార్క్, లోక్‌శాంతి మరాఠి-రుద్ర అనే మరో రెండు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం రెండు కూటముల మధ్య సమీప పోరు తప్పదని తెలుస్తోంది.
మహాయుతికి 13 నుండి 157 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పి-మార్క్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక మహా వికాస్ అఘాడి విషయానికొస్తే.. ఆ కూటమికి 126-146 స్థానాలు సొంతం చేసుకునే అవకాశం ఉందని పి-మార్క్ అంచనా వేసింది.
మహాయుతి కూటమికి 128-142 స్థానాల్లో విజయం సాధిస్తే... మహా వికాస్ అఘాడి కూటమికి 125-140 స్థానాలు గెలుచుకోవచ్చని లోక్‌శాంతి మరాఠి-రుద్ర ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా లేదా ఏ కూటమికైనా 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ దాటిన వారికి మరాఠీలు అధికారం అప్పజెప్పినట్లు భావించాల్సి ఉంటుంది.