Badlapur: స్కూల్ పిల్లలపై లైంగిక దాడి కేసులో నిందితుడి ఎన్‌కౌంటర్... హైదరాబాద్ 'దిశ' కేసును గుర్తు చేసిన పోలీసుల కథనం
బద్లాపూర్‌లో ఇద్దరు చిన్నారులపై స్కూల్ టాయిలెట్లో లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలతో అరెస్ట్ అయిన అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్లో చనిపోయాడు.
నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపూర్‌కు తీసుకువస్తున్న సమయంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకీ లాక్కొని కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సీఐ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్ పెక్టర్ నీలేష్ మోరే గాయపడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 23 సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని దగ్గర్లోని కాల్వా ఆసుపత్రి కి తీసుకువెళ్ళారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు.
ఆగస్ట్ 17న అరెస్ట్... సెప్టెంబర్ 23న ఎన్‌కౌంటర్
ఇద్దరు స్కూల్ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అక్షయ్ షిండేను పోలీసులు గత ఆగస్ట్ 17న అరెస్ట్ చేశారు. అప్పటికి ఘటన జరిగి అయిదు రోజులైంది. నిందితుడు బాధిత బాలికలు చదువుకుంటున్న బడిలో కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేసేవాడు.
ప్రదీప్ శర్మ టీమ్ లో పనిచేసిన సంజయ్ షిండే
ముంబయి పోలీసు శాఖలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మ టీమ్‌లో సంజయ్ శర్మ కూడా పని చేసినట్లు తెలుస్తోంది. థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లో దోపిడీ నిరోధక విభాగంలో ఉన్నప్పుడు ప్రదీప్ శర్మ టీమ్ లో సంజయ్ షిండే ఉండేవారని సమాచారం. గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్‌ను అరెస్ట్ చేసిన టీమ్‌లో కూడా ఆయన ఉన్నారు.
ప్రదీప్ శర్మ తన కెరీర్ లో 100 మందికి పైగా నేరస్తులను మట్టుబెట్టారని చెబుతుంటారు. ఆయన పోలీసు శాఖలో 1983లో చేరారు. 1990లలో ముంబై అండర్ వరల్డ్ సభ్యులపై ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ గ్యాంగ్ లతో సంబంధం ఉన్నవారిపై జరిగిన హై- ప్రొఫైల్ ఎన్ కౌంటర్లలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అయితే, 2006లో చోటా రాజన్ కు మాజీ సహాయకుడైన లఖన్ భయ్యా బూటకపు ఎన్ కౌంటర్‌లో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
షిండే ఫ్రమ్ ముంబయి టూ బద్లాపూర్...
బద్లాపూర్ స్కూల్ చిన్నారులపై లైంగిక దాడి కేసును విచారణకు ఏర్పాటు చేసిన సిట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం షిండేను ముంబై పోలీస్ విభాగం నుంచి రప్పించింది. గతంలో, ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ సలాండే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే 2014లో ముంబై పోలీసులు షిండేను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
ఎన్ కౌంటర్ పై సీఐడీ దర్యాప్తు
బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్షయ్ షిండే ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో ఉపయోగించిన వాహనాన్ని ఫోరెన్సిక్ టీమ్ పరిశీలించింది. ఇదే వాహనంలో కాల్పులు జరిగాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మృతుడి పేరేంట్స్ వాంగ్మూలాన్ని కూడా సేకరిస్తారు. అక్షయ్ షిండే తండ్రి అన్నా షిండే తన కొడుకు ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్
బద్లపూర్ ఎన్‌కౌంటర్ ఘటన తెలంగాణలో 2019లో జరిగిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేస్తోంది. దేశవ్యాపాతంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ - మర్డర్ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు కూడా షాద్ నగర్ దగ్గర, చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి సమీపంలో ఎన్‌కౌంటర్లో మరణించారు.
హైదరాబాద్ శివార్లలో దిశ దారుణంగా అత్యాచారానికి బలై బూడిదగా మిగిలిపోవడం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. ఆ ఘటనకు సంబంధించి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల నుంచి తుపాకీ లాక్కొన్ని నిందితులు కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని అప్పట్లో సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ ప్రకటించారు. తాజాగా బద్లాపూర్ ఘటన కూడా ఇదే తరహాలో జరిగింది.