Maharashtra: లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్పేలా లేదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే లాక్‌డౌన్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్పేలా లేదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే లాక్‌డౌన్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని, ఇతర మార్గాలు కూడా కనిపించడం లేదని అఖిలపక్ష నేతలతో సీఎం నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. నెల పాటు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి పూర్తిగా అధీనంలోకి వస్తుందని థాకరే పేర్కొన్నారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నెల15 నుంచి 20 మధ్య పరిస్థితులు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా చైన్‌ను కచ్చితంగా తెంచాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా దాడి చేస్తోందని సీఎం ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
కరోనాను అదుపు చేయడానికి కఠిన నిర్ణయాలు మంచిదే అయినా ప్రజల కోపాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. సీఎం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బాగా పెంచాలని మాజీ సీఎం సూచించారు. లాక్‌డౌన్ కారణంగా గత సంవత్సరం అంతా అస్తవ్యస్థమైందని చెప్పారు. కఠినమైన ఆంక్షలు తక్కువగా ఉండాలని, లేదంటే ప్రజలు జీవించడం ఎలా సాధ్యమైతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి థాకరేను ప్రశ్నించారు.