ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 5న అల్పపీడనం
* ఈనెల 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం... అల్పపీడన ప్రభావంతో 8, 9 తేదీల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు
Weather Report: దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఈ నెల 5న అల్పపీడనం ఏర్పడనుంది. ఈనంతరం అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 7వ తేదీ నాటికి వాయగుండంగా బలపడనుంది. 8వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుతుందని ఐఎండీ వెల్లడించింది. అల్పపీడన ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై అధికంగా దక్షిణ కోస్తాంధ్రపై మోస్తారుగా ఉండే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 6 నుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకావం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.