LokSabhaElections: సార్వత్రిక సమరం.. ప్రారంభమైన మూడో విడత పోలింగ్
LokSabhaElections: 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఓటింగ్
LokSabhaElections: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ కొనసాగుతుంది. 11 రాష్ట్రాల్లోని 93 సీట్లకు పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. గుజరాత్‌లో 25, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గఢ్‌లో 7 పార్లమెంట్ స్థానాలు, బిహార్‌లో 5, బెంగాల్‌లో 4, అసోంలో 4, గోవాలో రెండు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్, జమ్ము కశ్మీర్‌లోనూ పోలింగ్ కొనసాగుతుంది. ఇవాళ్టితో దేశంలోని 283 నియోజక వర్గాలకు ఓటింగ్ ముగియనుంది.
మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరగనుంది. గుజరాత్‌లో 26 స్థానాలు ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవం కావడంతో అక్కడ 25 సీట్లకే పోలింగ్ జరుగుతోంది. ఇక ప్రధాని మోడీ తన ఓటును అహ్మదాబాద్‌లో వేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లో, కేంద్ర మంత్రులు పురుషొత్తం రూపాల రాజ్ కోట్, మన్‌సుఖ్ మాండవీయ పోరుబందర్ నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి జ్యోతిరాదిత్య సిందియా, కర్ణాటకలోని ధార్వాడలో ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ విదిశా నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్ గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మూడో విడత ఎన్నికల బరిలో నిలిచారు.