Lok Sabha Election 2024: ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. పోలింగ్ తేదీలు ఇవే..
Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా
Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు.
ఇక లోక్ సభ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు సీఈసీ రాజీవ్‌కుమార్. తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుందని అన్నారు. ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదలవుతుందని.. ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుందని, మే 7న పోలింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. మూడో విడతలో 12 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మే 13న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అని అంటారు. రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు ఎన్నికల కోడ్‌ను తప్పకుండా ఫాలో కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘానికి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. పోలింగ్ తేదీలకు ముందు రాజకీయ పార్టీలు, నాయకులు చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటి అనేది ఎన్నికల కోడ్ నిర్దేశిస్తుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ రూల్స్ ఉపయోగపడతాయి. ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి అనుగుణంగానే వ్యవహరించాలి. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు ఫలితాలు వెలువడే వరకు కోడ్ అమల్లో ఉంటుంది.
ఇక ఎన్నికల కోడ్‌లో భాగంగా కేంద్రం లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదనే నిబంధన ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వాడకుండా రిస్ట్రిక్షన్ ఉంటుంది. మీడియాలో ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టడం, వారిని బెదిరించడం వంటి అంశాలన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి.