దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను.. మరో విడత పొడిగిస్తారా..? మే 3 తర్వాత ఇంకో 15 రోజుల పాటు లాక్‌డౌన్ ను కొనసాగిస్తారా..? ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఉపసంహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఇటు ఎప్పట్లాగే ఈ సారి కొత్తగా దో గజ్ దూరీ అనే నినాదం ఇచ్చారు ప్రధాని మోడీ.
లాక్‌డౌన్ అమలు తీరు కంటైన్మెంట్ జోన్లల్లో తీసుకుంటున్న చర్యలు వలస కూలీలకు అందుతున్న సౌకర్యాలపై ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎంలతో నాలుగో సారి నిర్వహించిన ఈ సమీక్షలో మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరాయి. మొత్తం 9 మంది సీఎంలు మాట్లాడగా అందులో నలుగురు సీఎంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాయి. మిగతా ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని కోరారు.
రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లకు వేర్వేరుగా లాక్‌డౌన్ నిబంధనలను ఉండాలని మరికొన్ని రాష్ట్రాలు సూచించాయి. గ్రీన్ జోన్ పరిధిలో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని కూడా కోరాయి. దీంతో కేంద్రం బ్లూ ప్రింట్ సిద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పాల్గొన్నారు. అయితే కేరళ సీఎం విజయన్ ఈ సారి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంతో ఆ రాష్ట్రం తరపున సీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశంలో లాక్‌డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ అన్నారు. మనమంతా కలిసి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వేల మంది ప్రాణాలు రక్షించుకోవడంలో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. నిరంతరం నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాది హామీ పథకాన్ని ప్రారంభించామని కొన్ని రకాల పరిశ్రమలకు కూడా అనుమతించామని మోడీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వద్దని అంతా బాగుందని స్పష‌్టం చేశారు.
సుమారు 3 గంటల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగో సారి. ఇప్పటికే మార్చ్ 22 న జనతా కర్ఫ్యూ తర్వాత లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడగించారు. పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎంలతో ప్రధాని మోడీ అన్నారు.