లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు : అనుమతులున్నవి.. అనుమతుల్లేనివి..

Update: 2020-04-15 08:41 GMT

లాక్‌డౌన్‌ వేళ ఈ నెల 20 తర్వాత కొంత సడలింపు ఇచ్చినా పరిమిత అనుమతులు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని బట్టి కొన్ని పరిమిత సడలింపులు ఉంటాయని స్పష్టం చేసింది. కానీ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

లాక్‌డౌన్‌ విషయమై పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి ఈ గైడ్‌లైన్స్‌ అమల్లోకి రానున్నాయని పేర్కొంది. మత సంబంధమైన ఏ కార్యక్రమానికి కూడా వెసులుబాటు లేదని స్పష్టం చేసింది. మే 3 వరకు విద్యాసంస్థలు పూర్తిగా మూసివేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. వాహనాల రవాణా విషయంలో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్ చేయాలని కేంద్రం చెప్పింది.

వైద్య సేవలకు తప్ప మిగిలిన ఏ అవసరం కోసం సరిహద్దును దాటేందుకు ఎవరినీ అనుమతించరు. ఆరోగ్య, ఔషధ కేంద్రాలు, దుకాణాలు తెరిచి ఉంటాయి.వివాహాలు, శుభకార్యక్రమాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి. సందర్భం బట్టి సంఖ్యకు అనుమతి ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు 20 మంది వరకు అనుమతిస్తారు. ఉపాధి హామీ పనులకు కూలీలను అనుమతించనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రం అనుమతి నిచ్చింది. పట్టణ పరిధిలో లేని అన్ని రకాల ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్‌లకు అనుమతినిచ్చింది. నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతినిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు పూర్తిగా అనుమతినిచ్చింది.

హాట్‌స్పాట్లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. హాట్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధమని మరోసారి తేల్చిచెప్పింది. హాట్‌స్పాట్లలో నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అనవసరంగా బయటకు వస్తే కఠిన శిక్షలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. మే 3 వరకు థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్స్ మూసివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. మే 3వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు కూడా ఆపివేయాలని చెప్పింది.

బయటకు వస్తే మాస్క్‌లు తప్పనిసరని చెప్పిన కేంద్రం బహరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. కూరగాయలు, పండ్లు, పాలు, నాన్‌వెజ్ షాపులకు అనుమతి నిచ్చింది. అన్ని రకాల ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతినిచ్చింది. అంత్యక్రియల విషయంలో కూడా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అంత్యక్రియలలో కేవలం 20 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News