ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన
* కాసేపట్లో గణపతి పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం.. రెండ్రోజులు జరిగే పూజల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
KCR: భారత్ రాష్ట్ర సమితి కోసం సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. దేశ రాజధాని నుంచి రాజకీయాలు చేసేందుకు రెఢీ అయ్యారు. ఇక హస్తినలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. రేపు ఢిల్లీలో బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న కేసీఆర్ ఇవాళ, రేపు రాజశ్యామల యాగం చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని డిసైడ్ అయిన కేసీఆర్.. రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఇప్పటికే ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఎస్పీ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని రేపు కేసిఆర్ ప్రారంభిస్తారు. అందుకోసం నిన్న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ జాతీయ విధానాన్ని సైతం అక్కడే ప్రకటిస్తారు. దాంతో పాటు జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులను ఆహ్వానిస్తున్నారు.
ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఈరోజు, రేపు యాగాలు, పూజాదికాలు నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం తలపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఉదయం 9 గంటలకు 12మంది ఋత్విక్కులు గణపతి పూజతో యాగాన్ని మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే వీరు ఢిల్లీకి చేరుకున్నారు. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
వారం రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, ఓబీసీ సంస్థలతో సమావేశమై బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్, అక్కడ బీఆర్ఎస్ కార్యకలాపాలను మొదలు పెట్టడానికి పార్టీ ఆఫీసులు తెరవనున్నరు. విజయవాడలోనూ బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి భూముల కోసం ఆ పార్టీ నేతలు గాలిస్తున్నారు. త్వరలోనే ముంబై, బెంగళూరులో కార్యాలయాలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టిన కేసీఆర్ 2023 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకతో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని భావిస్తున్నారు. తనతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలలో ముందుకు వెళ్లలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల నగారా మోగించనున్నారు.