Juice Vendor Arrested: జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న వ్యాపారి అరెస్ట్.. దుకాణంలో క్యాన్ నిండా..

Update: 2024-09-14 15:32 GMT

Juice Vendor Arrested: ఎవరికి, ఎలా అనుమానం వచ్చిందో ఏమో తెలియదు కానీ, ఒక జ్యూస్ దుకాణం నిర్వాహకుడి అసలు రంగును మాత్రం ఇట్టే పసిగట్టేశారు. అతడు కస్టమర్లకు అమ్మే జ్యూస్‌లో మానవ మూత్రం కలిపి విక్రయిస్తున్నట్లు జనం గుర్తించారు. అనుమానం రావడమే ఆలస్యం, ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, అతడి దుకాణంలో సోదాలు నిర్వహించారు. తమ సోదాల్లో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. జనం ఫిర్యాదు చేసినట్లుగానే ఒక డబ్బా నిండా మానవ మూత్రం నింపి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదేంటని ఆరా తీసిన పోలీసులకు అతడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు మరింత చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. ఇంకేం.. దుకాణం సీజ్ చేసి, అతడిని పోలీసు వ్యాన్ ఎక్కించుకుని స్టేషన్‌కి తరలించారు.

వినడానికే అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానిక ఏసీపీ అంకుర్ విహార్ భాస్కర్ వర్మ స్పందించారు. ఇందిరాపురి చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖుషీ ఫ్రూట్ జ్యూస్ కార్నర్ షాపులో దుకాణం నిర్వాహకులు జ్యూస్ లో మూత్రం కలిపి విక్రయిస్తున్నట్లుగా జనం ద్వారా తమకు ఫిర్యాదు అందింది. వెంటనే తమ సిబ్బంది వెళ్లి దుకాణంలో సోదాలు చేపట్టగా.. అక్కడే ఓ ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసి ఉన్న మానవ మూత్రం కనిపించింది. దుకాణం నిర్వాహకుడు అమీర్‌ని ప్రశ్నిస్తే, అతడు సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. వెంటనే అతడిని అరెస్ట్ చేశాం అని ఏసీపీ తెలిపారు. అతడితోపాటే అక్కడ పనిచేస్తోన్న మరో బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలో పానీపూరి వ్యాపారం చేసేవాళ్లు కూడా ఇలా మూత్రం కలుపుతూ పట్టుబడిన సందర్భాలున్నాయి. ఇలాంటి వాళ్లు కొంతమంది చేయబట్టి వీధి వ్యాపారులని నమ్మాలంటేనే భయం వేస్తోందని జనం చెబుతున్నారు. మామూలుగానే రోడ్లపై ఎక్కడబడితే అక్కడ తినడం, తాగడం ఆరోగ్యానికి అంత మంచి అలవాటు కాదు. అలాంటిది కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్లు కూడా ఉంటే, ఇక కస్టమర్స్ పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆరోగ్యరీత్యా స్ట్రీట్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే, ఒకటికి రెండుసార్లు ఆలోచించడం బెటర్ అనేది జనం చెబుతున్న మాట.

Tags:    

Similar News