Indians in America: ఆ ఇండియన్స్‌ని చార్టర్ ఫ్లైట్‌లో తిరిగి వెనక్కి పంపించిన అమెరికా
America sends back Illegal indian immigrants: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో వెనక్కి పంపించింది. అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విమానం అక్టోబర్ 22నే అక్కడి నుండి ఢిల్లీకి బయల్దేరినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు స్మగ్లర్ల చేతిలో చిక్కుకునే ప్రమాదం ఉన్నందునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్ మెంట్ తమ ప్రకటనలో పేర్కొంది.
భారత ప్రభుత్వంతో సంప్రదింపులు తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ బాధ్యతలను పర్యవేక్షించిన ఆ శాఖ డిప్యూటీ సెక్రటరీ క్రిస్టీ ఎ కెనగాలో తెలిపారు. భారత ప్రభుత్వం సహకారంతోనే ఈ పని పూర్తి చేసినట్లు క్రిస్టీ కెనగాలో పేర్కొన్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై, గడువు పూర్తయినా దేశం విడిచిపెట్టి పోకుండా అక్రమంగా ఉంటున్న వారిపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తుందని క్రిస్టీ కెనగాలో తేల్చిచెప్పారు.
2024 లో ఇండియా సహా 145 దేశాలకు చెందిన 1,60,000 మందిని వారి వారి దేశాలకు వెనక్కి తిరిగి పంపించినట్లు అమెరికా స్పష్టంచేసింది. అందుకోసం 495 విమానాలను ఏర్పాటు చేసినట్లు క్రిస్టీ కెనగాలో తెలిపారు. చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న విదేశీయులను వెనక్కి పంపించడం కోసం అమెరికా ప్రపంచదేశాల్లోని అక్కడి ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు.
చట్టబద్ధంగా కాకుండా ఇక్కడ అక్రమంగా ఉంటున్న వారు అసాంఘీక శక్తుల చేతికి చిక్కి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ఇది తమ దేశం తీసుకుంటున్న చర్యగా అమెరికా చెప్పుకొచ్చింది. అలా గతేడాది అమెరికా వెనక్కి పంపించిన పౌరుల జాబితాలో కొలంబియా, ఈక్వెడార్, పెరు, ఈజిప్ట్, మార్టేనియా, సెనెగల్, ఉబ్జెకిస్తాన్, చైనా, భారత్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.