Maharashtra Election 2024: మహా సంగ్రామం.. రెండు కూటములను వెంటాడుతున్న రెబల్స్ టెన్షన్..
Maharashtra Election 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుంది.
Maharashtra Election 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుంది. దాదాపు మూడో వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. ఇవే గెలుపుఓటములు నిర్దేశిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితితే నెలకొంది. కానీ ఈసారి, ఇంతవరకు కలిసి ఉన్న మిత్రులే శత్రువులుగా.. శత్రువులే మిత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీల మధ్య అసహజ మిత్రుత్వం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో ఈ నెల 23న తేలనుంది.
మహారాష్ట్రలో 6 జోన్లు ఉన్నాయి. ఇందులో విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ఆర్థికంగా వెనుకబడ్డాయి. ఇక మిగిలిన ముంబయి, ఠాణె-కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు దేశ జీడీపీకి అత్యధికంగా వాటాను అందిస్తున్న రాష్ట్రం కూడా మహారాష్ట్రనే. ఇక ముంబయి, పశ్చిమ మహారాష్ట్రల్లో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఎన్నికల్లో ఏ కూటమైనా విజయం సాధించాలంటే మిత్రపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రాజకీయాల్లో రెండు రెండు కలిస్తే నాలుగు కావు. అది మూడైనా, ఐదైనా కావొచ్చు. అలాంటి పరిస్థితే ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొంది. మహా వికాస్ అఘాడీ, మహాయుతి కూటముల్లోనూ అసహజ మిత్రులు ఉన్నారు. దీంతో పార్టీల మధ్య 100 శాతం ఓట్ల బదిలీ అనేది అనుమానమే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీలో ఓట్ల బదిలీ బాగానే జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ), ఉద్దవ్ శివసేన పార్టీల మధ్య సరైన అవగాహనే కొనసాగింది.
ఈసారి మహా ఎన్నికల్లో మరాఠా అంశం కీలక పాత్ర పోషించనుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చిన్న చిన్న పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. వాటితోపాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపుఓటములపై ప్రభావం చూపుతారు. ఇక రెబల్స్ ప్రభావం ఎలాగూ కాదనలేని అంశం. గత 5 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున 30 సీట్ల వరకూ గెలుస్తున్నారు. 25 శాతం వరకు ఓట్లు సాధిస్తున్నారు. ఈసారి సగం స్థానాల్లో రెండు కూటములకు కూడా రెబల్స్ బెడద ఉంది.
వలస వచ్చిన ఓటర్లే మహారాష్ట్రలో 8శాతం వరకు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఇందులో అధికంగా ఉంటారు. ముంబయిలో వలస వచ్చిన వారి జనాభా 43శాతం. నగరంలో మహారాష్ట్రీయులు 42శాతం ఉంటారు. 19శాతం వరకు గుజరాతీలుంటారు. ఉద్ధవ్‌తోపాటు శరద్ పవార్ కూడా మరాఠా ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెచ్చారు.