Long Range Hypersonic Missile: లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్ ప్రయోగంలో DRDO సక్సెస్
Long Range Hypersonic Missile: లాంగ్ రేజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్స్ ప్రయోగాల్లో భారత్ మరో ముందడుగేసింది. రక్షణ శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తూన్న డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) శనివారం తొలిసారిగా లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను ప్రయోగించి విజయం సాధించింది. 1500 కిమీ దూరంలోని సుదూర ప్రాంతాల లక్ష్యాలను ఛేదించేలా ఈ హైపర్‌సోనిక్ మిస్సైల్‌ని రూపొందించారు. ఒడిషా తీరంలోని డా ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ రిసెర్చ్ సెంటర్ నుండి ఈ క్షిపణిని ప్రయోగించారు. డిఆర్డీడీవో సీనియర్ సైంటిస్టులు, ఆర్మీ బలగాల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది.
ఇండియన్ ఆర్మీలోని అన్ని విభాగాలకు ఈ లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. హైదరాబాద్‌లోని డా ఏపిజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ ల్యాబోరేటరీలో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మిస్సైల్‌ను రూపొందించారు. దేశంలోని ఇతర డీఆర్డీవో విభాగాలు, రక్షణ రంగంలో పనిచేస్తోన్న పలు ఇతర పరిశ్రమల నుండి నిపుణులు ఈ క్షిపణి తయారీలో పాల్పంచుకున్నారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా హైపర్‌సోనిక్ మిస్సైల్ ఫ్లైట్ లాంచింగ్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్డీడీఓను అభినందించిన రాజ్‌నాథ్ సింగ్, ఈ ప్రయోగంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్ చెప్పారు.