TOP 6 NEWS @ 6PM: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. ఇదిగో ప్రూఫ్ అంటున్న బండి సంజయ్
1) Rammurthy Naidu Cremated: అదే చోట రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి
Rammurthy Naidu cremated with full state honours in Naravaripalli: నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చెంతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, చంద్రబాబు సన్నిహితమిత్రులు, నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు.
రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమయంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కివెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయపడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది.
2) Actress Kasturi: కస్తూరికి రిమాండ్.. జైలుకు తరలింపు
Actress Kasturi arrested and remanded: సినీ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రఘుపతి రాజా ఆమెకు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం కస్తూరిని ఎగ్మోర్ పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. నవంబర్ 29వ తేదీ వరకు కస్తూరి రిమాండ్ లో ఉండనున్నారు. తమిళనాడులో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో కస్తూరి మాట్లాడుతూ తెలుగు వారికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపైనే చెన్నైలోని ఎగ్మోర్ పోలీసు స్టేషన్‌లో తెలుగు సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి ఎగ్మోర్ పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నారు.
విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. దీంతో ఆమె పరారీలో ఉన్నారని భావించిన పోలీసులు బృందాలుగా విడిపోయి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శనివారం కస్తూరిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు.
3) Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. ఇదిగో ప్రూఫ్ : బండి సంజయ్
Bandi Sanjay rebukes Revanth Reddy And KTR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కలిసి నాటకాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కుంభకోణాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని బండి సంజయ్ గుర్తుచేశారు. అంతేకాకుండా దీపావళికి ముందే తెలంగాణలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తుచేశారు. దీపావళి పండగ పోయి త్వరలోనే సంక్రాంతి పండగ కూడా రాబోతోంది కానీ కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదన్నారు.
బీఆర్ఎస్ నేతల గురించి అన్ని మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హై కమాండ్ ను కలవడంతోనే ఈ కుంభకోణాలు అన్నీ ఏమైపోయాయో ఏమోనని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పడానికి ఇంకేం కావాలని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఇద్దరు సీఎంలు ఉన్నారని.. వారిలో ఒకరు రేవంత్ రెడ్డి కాగా మరొకరు కేటీఆర్ అని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ నటన చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
4) ఖమ్మంలో ర్యాగింగ్ కలకలం.. స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
ఖమ్మంలో మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి గుండు కొట్టించి ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ర్యాగింగ్ గురించి సమాచారం అందుకోగానే సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి ర్యాగింగ్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
5) The Sabarmati Report: నిజం బయటికొస్తోంది.. ఆ సినిమాపై ప్రధాని మోదీ ప్రశంసలు
PM Modi praised The Sabarmati Report Movie : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలె రిలీజైన ది సబర్మతి రిపోర్ట్ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. పొలిటికల్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌తో విక్రాంత్ మాస్సీ, రాశి ఖన్నా, రిధి డోగ్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా తి సబర్మతి రిపోర్ట్. అవినాష్, అర్జున్ కలిసి రచించిన ఈ సినిమాను రంజన్ చండేల్, ధీరజ్ సర్నా డైరెక్ట్ చేశారు. 2002 నాటి గోధ్రా అల్లర్లకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ఐఎండీబీ 10 కి 8.1 రేటింగ్ (The Sabarmati Report IMDB rating) ఇచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి అలోక్ భట్ ట్వీట్ చేస్తూ అందులో ప్రధాని మోదీ ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ ను ప్రధాని మోదీ రిట్వీట్ చేస్తూ ప్రశంసలు గుప్పించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Champions Trophy 2025 : పాక్ నుంచి భారత్‌కు రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రకటించిన ఐసీసీ
Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుండి ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై సందిగ్ధత నెలకొంది. ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియాను భద్రత ఉన్న వేదికకు పంపాలని బీసీసీఐ పేర్కొంది. అయితే పాకిస్తాన్‌కు ఎలాంటి పరిస్థితుల్లోనే పంపేది లేదని బీసీసీఐ ప్రకటించింది. ఈ కారణంగా టోర్నీ చివరి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ICC ట్రోఫీని పాకిస్తాన్ పర్యటన కోసం పంపింది. ఇందులో భాగంగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నుంచి భారత్‌కు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా ప్రకటించింది.
ICC టోర్నమెంట్‌కు ముందు.. ICC ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. దీని కింద ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఎనిమిది దేశాల మధ్య ట్రోఫీని తిప్పడానికి ఒక పర్యటన నిర్వహిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ.. ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుండి ప్రారంభమైంది. ఇది 26 జనవరి 2025 వరకు కొనసాగుతుందని ICC స్పష్టంచేసింది. అన్ని దేశాల్లో పర్యటించిన తర్వాత ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ చేరుకోనుంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.