TOP 6 NEWS @ 6PM: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం.. పోలీసుల ఎదుటకు సురేశ్

Update: 2024-11-19 12:45 GMT

1) లగచర్ల దాడి కేసులో పోలీసుల ఎదుట ప్రత్యక్షమైన సురేశ్

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడిన కేసులో A2 నిందితుడిగా ఉన్న బోగమోని సురేశ్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సురేశ్ ను పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. నవంబర్ 11న ఈ ఘటన జరిగింది. అప్పటి నుండే సురేశ్ అదృశ్యమయ్యారు. దాంతో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే సురేశ్ ఈ దాడికి కుట్ర చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నరేందర్ రెడ్డికి, సురేష్ కు మధ్య 42 ఫోన్స్ కాల్స్ వెళ్లడమే అందుకు నిదర్శనం అని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

2) Revanth reddy to KCR: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం

తెలంగాణ అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే ఇక తాము చేయడానికి ఏం మిగిలి ఉంటుందనేదే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బాధ అని రేవంత్ రెడ్డి అన్నారు. మీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు కానీ తెలంగాణ కోల్పోయిందేం లేదన్నారు. రాహుల్ గాంధీ మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను చూసి నేర్చుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణలో నిజంగా ప్రజ సమస్యలు ఉన్నాయని మీరు ఆరోపించే మాట నిజమే అయితే, ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌజ్‌లో ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు.

Full View

3) Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆ క్రిమినల్ కేసు కొట్టేసిన కోర్టు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలొచ్చాయి. వాలంటీర్లు సమాజంలో అసాంఘిక శక్తులుగా మారారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటూ కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు లేఖ రాశారు.

ప్రభుత్వం ఆదేశాలతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్‌పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ కేసుపై పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు గుంటూరు కోర్టు తాజా విచారణలో తాము పవన్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును కొట్టివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

4) Ram Gopal Varma: నేను విచారణకు రాలేను..వారం రోజులు గడువు కావాలి: ఆర్జీవీ

Ram Gopal Varma: పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ప్రస్తుతం తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని..విచారణ హాజరుకాలేనని..పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. వారం రోజులు పాటు గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆర్జీవీ వాట్సాప్ లో మెసేజ్ చేశారు. రాంగోపాల్ వర్మ కేసు విచారణ మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరగాల్సి ఉంది. అయితే రాంగోపావల్ వర్మ షూటింగ్‌లో ఉన్నారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ లపై ఆర్జీవీ ట్విట్టర్ లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది.

5) Delhi Pollution: కాలుష్య కొరల్లో దేశ రాజధాని..లాక్ డౌన్ ఒక్కటే మార్గమా?

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కొరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆగే సూచనలు కనిపించడం లేదు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్ గా మారిపోయిన పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యత సూచిక 400 దాటేసింది. ఢిల్లీలో ప్రతి ఏడాది ఈ సమస్య తీవ్రమవుతోంది. ఢిల్లీ కాలుష్యాన్ని లాక్ డౌన్ మాత్రమే తొలగించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఢిల్లీలో లాక్ డౌన్ ఒక్కటే మార్గమా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. ఢిల్లీ పరిస్థితి నగర విషపూరిత వాతావరణానికి అద్దం పడుతోంది. ఢిల్లీలోని గాలికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం కష్టం మారుతోంది. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజూ 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానమని పలు నివేదికలు చెబుతున్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Donald Trump: నేషనల్ ఎమర్జెన్సీకి ట్రంప్ ప్లానింగ్.. వారిని దేశం దాటించేందుకు భారీ స్కెచ్

Mass deportation in US with National emergency: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలిరోజే ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే విషయమై గతంలోనే హెచ్ఎంటీవీ ఒక వివరణాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ట్రంప్ సోమవారం సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించనున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. అనధికారికంగా అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులను వారి వారి సొంత దేశాలకు పంపించేందుకు ఆ నేషనల్ ఎమర్జెన్సీని ఉపయోగించుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ, మాస్ డిపోర్టేషన్‌ అమలు చేయడం కోసం అమెరికా మిలిటరీని రంగంలోకి దింపనున్నట్లు ట్రంప్ తేల్చిచెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News