Top 6 News @ 6PM: జగన్ విషపు నాగు, చంద్రబాబుతో నాకేం సంబంధం: షర్మిల.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

అక్టోబర్ 27న తెలంగాణ, ఏపీ సహా ప్రపంచం నలుమూలల చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

Update: 2024-10-27 12:45 GMT

Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 27న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

1) విజయసాయి రెడ్డికి షర్మిల సవాల్

ఆస్తుల కోసం, సొంత ప్రయోజనాల కోసం కన్న తల్లిని కోర్టుకీడ్చిన వైఎస్ జగన్ విషపు నాగు కాదా అని వైఎస్ షర్మిల అన్నారు. తనపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా షర్మిళ స్పందించారు. వైఎస్ఆర్ ఆస్తుల్లో నలుగురు మనవళ్లకు సమాన హక్కులు ఉన్నాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని విజయసాయి రెడ్డికి సవాల్ విసిరారు. మీరు కూడా జగన్ వల్ల ఆర్థికంగా లాభపడిన వాళ్లే కనుక ఆయన రాసిచ్చిన స్క్రిప్టే చదివి వినిపిస్తారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ ది. అలాంటిది ఆయన మరణం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఎలా అంటారని షర్మిల నిలదీశారు. బంగారు బాతును ఎవ్వరూ చంపుకోరు అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చంద్రబాబు చెప్పినట్లే షర్మిల చేస్తున్నారని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతం ఆమె కౌంటర్ ఇచ్చారు. తనకు ఎవరితో వ్యక్తిగత సంబంధాలు లేవని షర్మిల స్పష్టంచేశారు.

2) విజయమ్మ, షర్మిల భద్రతపై సందేహం వ్యక్తంచేసిన మాజీ మంత్రి

వైఎస్ జగన్ కు చెందినది గా చెబుతున్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వివాదంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల పేరుతో రైతుల నుండి జగన్ వందల ఎకరాలు తీసుకున్నప్పటికీ 15 ఏళ్లుగా పరిశ్రమను స్థాపించలేదన్నారు. అంతేకాదు.. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఒక సోసైటీ ఏర్పాటు చేసి మళ్లీ రైతులకే ఇస్తే కనీసం ధాన్యం ఉత్పత్తి అయినా పెరుగుతుందన్నారు. లేదంటే ఆ భూములను మరో కంపెనీకి ఇస్తే అలాగైనా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. జగన్ వైఖరితో ప్రస్తుతం విజయమ్మ, షర్మిల భద్రతపై కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తిందని సందేహం వ్యక్తంచేశారు.

3) కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌజ్‌లో రేవ్ పార్టీ

జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. భారీ శబ్దాలతో పార్టీ జరుగుతోంది అని సమాచారం అందుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు జన్వాడ చేరుకున్నారు. పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో ఈ రేవ్ పార్టీ బట్టబయలైంది. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు కలిపి మొత్తం 35 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందినదిగా వార్తలొస్తున్నాయి. రాజ్ పాకాలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయదుర్గంలోని ఆయన సోదరుడు రాజేంద్ర ప్రసాద్ విల్లాకు పోలీసులు వెళ్లగా అక్కడ బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, వివేకానంద, మాగంటి గోపినాథ్ వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో సోదాలు చేపట్టారు.

4) నేటితో ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు

తెలంగాణలో టిజిఎస్పీఎస్సీ ఆద్వర్యంలో అక్టోబర్ 21న మొదలైన గ్రూప్ 1 పరీక్షలు నేటి చివరి పరీక్షతో ముగిశాయి. రోజుకొక పేపర్ చొప్పున ప్రతీరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. 513 పోస్టులకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,383 మంది అర్హత సాధించారు.

5) దీపావళి రద్దీతో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికి గాయాలు

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో ఇవాళ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 9 మందికి గాయాలయ్యాయి. దీపావళి పండగ సెలవుల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే 1వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి రైలు ప్రయాణికులు భారీ సంఖ్యలో దూసుకొచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట పెరిగి ఒకరిపైమరొకరు పడిపోయారు. క్షతగాత్రులను రైల్వే పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

6) ఇరాన్‌ని దెబ్బ కొట్టాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ ఎటాక్ లో ఇరాన్ క్షిపణి వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో ఇరాన్ పై తమ సైనిక బలగాలు చేసిన దాడిలో తాము విజయం సాధించాం అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అక్టోబర్ 1న రాత్రి ఇజ్రాయెల్ పై ఇరాన్ 180 నుండి 200 మిస్సైల్స్ వర్షం కురిపించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతోంది. అందులో భాగంగానే శనివారం కూడా తాము మిసైల్ ఎటాక్ కొనసాగించాం అని నెతన్యాహు స్పష్టంచేశారు. ఇదిలావుంటే మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై ఇరాన్ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ.. ఖమెనీకి తరువాతి వారసుడు ఎవరు అనే చర్చ మాత్రం అప్పుడే మొదలైంది.

Tags:    

Similar News