Zeeshan Siddique: ఎన్సీపీలో చేరిన బాబా సిద్దిఖీ కొడుకు జీషాన్ సిద్దిఖీ
Zeeshan Siddique: బాబా సిద్దిఖీ కొడుకు జీషాన్ శుక్రవారం ఎన్ సీ పీ అజిత్ పవార్ పార్టీలో చేరారు.
Zeeshan Siddique: బాబా సిద్దిఖీ కొడుకు జీషాన్ శుక్రవారం ఎన్ సీ పీ అజిత్ పవార్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జీషాన్ బాంద్రా తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఈ నెల 12న హత్య చేశారు. చాలాకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన సిద్దిఖీ ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ ను వీడి ఎన్ సీ పీ అజిత్ పవార్ వర్గంలో చేరారు. తండ్రి మరణించిన తర్వాత జీషాన్ ఎన్ సీ పీలో చేరారు. ఈ కష్టకాలంలో తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేర్చుకున్న అజిత్ పవార్ , ప్రపుల్ పటేల్ సహా ఇతరులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇవాళ తనకు, తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన రోజుగా ఆయన చెప్పారు. బాంద్రా ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి తాను విజయం సాధిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
శివసేన ఉద్ధవ్ వర్గానికి బాంద్రా సీటు కేటాయించడంపై జీశాన్ అసంతృప్తి
శివసేన (ఉద్ధవ్ ) వర్గం, కాంగ్రెస్, ఎన్ సీ పీ (శరద్ పవార్ ) పార్టీల మధ్య సీట్ల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా బాంద్రా తూర్పు అసెంబ్లీ సీటును కాంగ్రెస్ పార్టీ శివసేన (ఉద్ధవ్ ) వర్గానికి కేటాయించింది. దీంతో జీషాన్ అసంతృప్తి చెందారు. కొంత కాలం క్రితం వరకు ఈ కూటమి నాయకులు తనతో టచ్ లో ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ, తమ కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో వారి నుంచి స్పందన లేదన్నారు. ఈ సమయంలో తనకు అజిత్ పవార్, ప్రపుల్ పటేల్ అండగా నిలిచారని ఆయన చెప్పారు.